AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హైదరాబాద్‌‌లో ఒక్కసారిగా కుండపోత వర్షం.. ఎక్కడికక్కడా నిలిచిపోయిన ట్రాఫిక్

హైదరాబాద్ నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అప్పటివరకు మాడు పగిలేలా ఎండ దంచికొట్టగా.. నిప్పులు కురిపిస్తున్న సూర్యున్ని కారు మేఘాలు కమ్మేశాయి. ఎంతలా అంటే.. ఐదున్నర సమయంలోనే నగరంలో చిమ్మ చీకట్లు అలుముకున్నాయి. సాయంత్రం నాలుగు గంటల నుంచి కారు మబ్బులు కమ్ముకోగా.. ఏమవుతుందా అని జనాలు చూసేలోపే.. రాకాసి గాలులను తలపించే ఈదులు గాలులు వీస్తూ.. భయపెట్టేలా ఉరుములు, మెరుపులతో.. కుండపోతగా వర్షం కురిసింది. అది కూడా నిండు వర్షాకాలంలో కురిసినట్టుగా మేఘం విరిగిపడిందా అన్నట్టు వర్షం కురిసింది. దీంతో.. హైదరాబాద్ నగరంలో వాతావరణం పూర్తిగా తారుమారైంది. సుమారు 40 నిమిషాల పాటు కురిసిన భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.


ఇదిలా ఉంటే.. ఒక్కసారిగా కురిసిన కుండపోత వర్షంతో రోడ్ల మీద మొత్తం నీళ్లు నిలిచిపోయాయి. సరిగ్గా ఆఫీసులు వదిలే సమయంలోనే వరుణుడు విజృంభించటంతో.. రోడ్లపై ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులంతా వర్షంలో తడిసి ముద్దయిపోయారు. దీంతో.. రోడ్లన్ని ట్రాఫిక్‌తో నిండిపోయాయి. ముందుకు కదలలేక.. వర్షంలో తడుస్తూ ఉండలేక.. వాహనదారులు ట్రాఫిక్ జామ్‌లో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ వర్షంతో నగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడగా.. నగరవాసులకు ఉక్కపోత నుంచి కొంత ఉపశమనం దొరకనుంది. ఇదిలా ఉంటే… ఈ ఈదురుగాలులతో కూడా భారీ వర్షం వల్ల విద్యుత్ అంతరాయం, ట్రాఫిక్ సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు.

అయితే.. వాతావరణ శాఖ ముందుగా చెప్పినట్టుగానే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు మధ్యాహ్నం నుంచి భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా భారీ వర్షాలు కురిశాయి. కొంపల్లి, సుచిత్ర, శేరిలింగంపల్లి, జీడిమెట్ల, కొండాపూర్‌తో పాటు మియాపూర్, కూకట్ పల్లి, ఎస్సార్ నగర్, పంజాగుట్ట, ఖైరతాబాద్, గచ్చిబౌలి, మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లాంటి ట్రాఫిక్ ఏరియాల్లో కూడా భారీ వర్షం కురిసింది. మరోవైపు.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ANN TOP 10