AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రచ్చ రేపుతున్న కవిత పాలిటిక్స్..! బీఆరెస్‌ నేతల మౌనం వెనుక కారణం ఏమిటి..?

సిద్దిపేట కేంద్రంగా కవిత హరీశ్‌రావుపై ఘాటు విమర్శలు చేశారు. కేసీఆర్‌ పైనా ఇండైరెక్టుగా సెటైర్లు వేశారు. కేటీఆర్‌నూ తూర్పారబట్టారు. కొండపోచమ్మ సాగర్‌ నుంచి ఫామ్‌హౌజ్‌కు సాగునీళ్లు తరలించుకుపోతున్నారని క్లారిటీ ఇచ్చేశారు. ఫామ్‌హౌజ్‌ చుట్టూ ఆ కుటుంబానికి సంబంధించిన భూములు ఉన్నాయని గూగుల్ మ్యాప్‌లో పాయింట్‌ చేసి మరీ మీడియాకు చూపించారామె. ఆ కుటుంబ అవినీతిలో తాను లేనని చెప్పుకున్నారు. నిమ్స్‌లో వంద కోట్ల స్కామ్‌కు హరీశ్‌ తెరలేపారని కూడా ఆరోపించారు కవిత. కాళేశ్వరం ప్రాజెక్టు ఉద్దేశ్యమే పక్కదారి పట్టిందని, లక్ష్యం నీరుగారిపోయిందని విమర్శించారు. ఇవన్నీ విన్న తరువాత ఇక సైలెంట్‌గా ఉండటం భావ్యం కాదని డిసైడ్ అయ్యింది గులాబీ పార్టీ.

తండ్రి కేసీఆర్‌ వ్యూహాత్మకంగానే కవిత ఆరోపణలపై మౌనాన్నే ఆశ్రయిస్తున్నా.. కేటీఆర్, హరీశ్‌లు మాత్రం తట్టుకోలేకపోతున్నారు. అందుకే కేసీఆర్‌ను కూడా ఈ విషయంలో ఒప్పించినట్టున్నారు. ఇక మౌనం వీడాల్సిందేనని గట్టిగానే వాదించినట్టున్నారు. పెద్దాయన కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశాడంటున్నారు. అందుకే ఇవాళ పార్టీ తరుపున ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ కవితపై ఘాటు విమర్శలు చేశారు. పార్టీ అగ్రనాయకత్వం తరుపున ఆర్‌ఎస్‌ను పంపారని అందరికీ తెలిసిపోయింది. ప్రవీణ్‌ ఆరోపణలు కూడా తీవ్రంగానే ఉన్నాయి. కవిత.. రేవంత్‌రెడ్డి సారథ్యంలో తన పార్టీని నడుపుతున్నారని ఆరోపించారు. రేవంత్‌ తో కలిసి కంపెనీలను ఏర్పాటు చేశారని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీకి టీఆరెస్‌ పార్టీ నాలుగో అనుబంధ సంస్థగా మారిందన్నారు. మున్ముందు ఇంకా చాలా విషయాలు బయటపెడతామని ఆమెకు డైరెక్టు వార్నింగ్ ఇచ్చారు ఆర్ఎస్‌.

కేసీఆర్‌ .. కవితను పార్టీ నుంచి వెళ్లగొట్టి మంచి పనిచేశారని, ఆయనకు కృతజ్ఞతలు చెప్పడం ద్వారా కవితను మరింతగా రెచ్చిగొట్టారు ప్రవీణ్‌. హరీశ్‌పై కోపంతో ఏవేవో పనిగట్టుకుని ఆరోపణలు చేసే క్రమంలో ఆమె సోయి తప్పి మాట్లాడుతున్నారని హద్దు మీరి విమర్శించారు. ఇకపై మా మాటల దాడి కొనసాగుతుందని, ఇది మొదటి ఎపిసోడేనంటూ కాస్కో.. కవిత అనే విధంగా వ్యాఖ్యానించారాయన. కవిత పార్టీ పెట్టిన తరువాత .. ఆమె ఆ పార్టీ పై, నేతలపై చేసిన ఆరోపణలపై స్పందించడం ఇదే తొలిసారి. ఆర్ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ను తొలత దింపినా.. మున్ముందు ఇక మిగిలిన సీనియర్లు కూడా కవితపై ఫైర్‌ అయ్యేందుకు బయటకు రానున్నారని తెలుస్తోంది. గతంలో మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌ రెడ్డిలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ ఆదేశాల మేరకు మళ్లీ సైలెంట్‌ అయ్యారు. కవిత వ్యూహం కూడా బీఆరెస్‌ మౌనవ్రతాన్ని భంగం చేయాలనే. ఆమె వ్యూహంలో బీఆరెస్‌ చిక్కుకుంటున్నదా? అనే కొత్త చర్చ కూడా నడుస్తోంది.

ANN TOP 10