AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పదేళ్లలో దేశంలోనే నెం.1గా ఏపీ.. రాష్ట్రానికి రూ.30 లక్షల కోట్ల పెట్టుబడులు..

ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం, చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న రామోజీ ఎక్సెలెన్స్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొని షా మాట్లాడారు. తొలుత మోదీ పాలన గురించి మాట్లాడుతూ గతంలో ‘పాలసీ పెరాలసిస్’ గురించి చర్చ జరిగేదని.. నేడు ‘పెర్ఫార్మెన్స్ పాలసీ బేస్డ్ గవర్నెన్స్’ విధానం అమలవుతోందని అభిప్రాయపడ్డారు. రష్యా-ఉక్రెయిన్, అమెరికా-ఇరాన్ యుద్ధాల కారణంగా అనేక దేశాలు సంక్షోభంలో ఉంటే.. భారత ఆర్థిక వృద్ధి మాత్రం 7 శాతానికి పెరిగిందని షా అన్నారు. మూడీస్ సంస్థ ఈ విషయాన్ని స్పష్టం చేసిందని గుర్తు చేశారు.

ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం.. 12 ఏళ్ల మోదీ పాలనలో 50 కోట్ల మంది దారిద్ర్యరేఖ నుంచి బయటపడ్డారని అమిత్ షా అన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని పేర్కొన్నారు. అంతేకాకుండా భారతదేశ ఎగుమతులు.. వచ్చే ఏడాది నాటికి 1 ట్రిలియన్ డాలర్ల మార్కును దాటనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గత 13 ఏళ్లలో స్టీల్ ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానానికి చేరుకుందని ప్రస్తుతం జపాన్, అమెరికా దేశాల ఉత్పత్తికి సమానంగా మన దేశం స్టీల్ ఉత్పత్తి చేస్తోందని తెలిపారు.

మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా దేశంలోని 2.15 లక్షల గ్రామాలకు 4జీ కనెక్టివిటీ చేరుకుందని అమిత్ షా తెలిపారు. దేశీయంగానే హైడ్రోజన్ రైళ్లను నిర్మించి నడిపిస్తున్నామని చెప్పారు. విమానయాన రంగంలోనూ 150 విమానాశ్రయాలతో భారత్ వేగంగా ముందుకు సాగుతోందని వివరించారు. అటు దేశ భద్రత విషయంలో ప్రభుత్వం సాధించిన ప్రగతిని సైతం హోంమంత్రి ప్రస్తావించారు. ఆర్టికల్ 370 రద్దుతో పాటు ఐదు దశాబ్దాల నక్సల్ వాదాన్ని నిర్మూలించడంలో విజయం సాధించామని అమిత్ షా పేర్కొన్నారు. గత 40 ఏళ్లలో ప్రతి ఏటా 2 వేలకు పైగా నక్సల్ దాడులు జరిగేవని.. కానీ నేడు దేశంలో ఒక్క నక్సల్ దాడి కూడా జరగని పరిస్థితి వచ్చిందన్నారు.

రామోజీ ఎక్స్ లెన్స్ అవార్డు ప్రధానోత్సవం కార్యక్రమంలో తనతోపాటు పాల్గొన్న సీఎం చంద్రబాబుపై కూడా అమిత్ షా ప్రశంసలు కురిపించారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ నిరంతరం అభివృద్ధి చెందుతోందని ప్రశంసించారు. రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి సాధ్యమవుతుందని తాను మొదట భావించానని అయితే చంద్రబాబు రాష్ట్రాన్ని గాడిలో పెట్టి పరుగులు పెట్టిస్తున్నారన్నారు. రాబోయే 10 ఏళ్లలో ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా అగ్రస్థానానికి చేరుకుంటుందని అభిప్రాయపడ్డారు. గతంలో కొందరు చేసిన తప్పుల వల్ల నిలిచిపోయిన పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు మళ్లీ పునరుద్ధరించి, ప్రజలకు, రైతులకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు.

గత రెండున్నర ఏళ్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి రూ.30 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకువచ్చారని అమిత్ షా పేర్కొన్నారు. ముఖ్యంగా గూగుల్ సంస్థ విశాఖపట్నంలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టడం ఆంధ్రప్రదేశ్‌కే కాకుండా దేశానికే గర్వకారణమని అన్నారు. అమెరికా వెలుపల ఏర్పాటవుతున్న మొట్టమొదటి గూగుల్ డేటా సెంటర్ ఇదే కావడం దేశానికి ఎంతో ప్రయోజనకరమని చెప్పారు. దీనితో పాటు విశాఖ తీరంలోని సముద్రగర్భం నుంచి వెళ్లే సబ్-సీ కేబుల్ ప్రాజెక్టు, రాష్ట్రంలో ఏర్పాటవుతున్న తొలి సెమీకండక్టర్ యూనిట్, స్టీల్ ఫ్యాక్టరీలు, భోగాపురం విమానాశ్రయం వంటివి రాష్ట్రాభివృద్ధిలో కీలక మైలురాళ్లుగా నిలుస్తాయని ఆయన వివరించారు.

ANN TOP 10