రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల నిర్వహణకు అధికారిక ప్రకటన జారీ అయినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విడతలో విజయనగరం జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలో గల 10 మండలాల్లోని గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయని ఆయన పేర్కొన్నారు.
బొబ్బిలి డివిజన్: దత్తిరాజేరు, గజపతినగరం, మెంటాడ.
చీపురుపల్లి డివిజన్: రేగిడి ఆమదాలవలస, వంగర, రాజాం, సంతకవిటి.
విజయనగరం డివిజన్: బొండపల్లి, గంట్యాడ, జామి.
ఎన్నికల నోటీసు & ఓటర్ల జాబితా ప్రదర్శనను నవంబర్ 18న రిటర్నింగ్ అధికారులు ఫారమ్-I లో నోటీసు జారీ చేసి, వార్డుల వారీగా ఓటర్ల జాబితాను ప్రదర్శిస్తారు. నవంబర్ 18 నుంచి 20వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు నిర్వహించనున్నారు.
నవంబర్ 21న ఉదయం 8.00 గంటల నుంచి అప్పీళ్లు, పరిష్కారం.. తిరస్కరణకు గురైన నామినేషన్లపై నవంబర్ 22 సాయంత్రం 5.00 గంటల వరకు సంబంధిత ఆర్డీవో వద్ద అప్పీల్ చేసుకోవచ్చు. వీటిని నవంబర్ 23న అధికారులు పరిష్కరిస్తారు. నవంబర్ 24 మధ్యాహ్నం 3.00 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందని అనంతరం అదే రోజు బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించనుంది.
నవంబర్ 29న ఉదయం 7.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 2.00 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు. అనంతరం ఫలితాలు ప్రకటించిన రోజే ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు. ఎక్కడైనా రీపోలింగ్ అవసరమైతే నవంబర్ 30న ఉదయం 7.00 నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు నిర్వహించి, మధ్యాహ్నం 2.00 గంటల నుంచి ఓట్లను లెక్కించనున్నారు. జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ఓటర్లు ఎన్నికల నియమావళిని పాటించి సహకరించాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి పిలుపునిచ్చారు








