ఓ వైపు రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. ప్రధాన పార్టీలు ఈ ఎన్నికల్లో అత్యధిక ఎంపీ స్థానాలు గెలిచేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ఎన్నికలతో పాటు నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ కూడా వచ్చేసింది. ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్నను ఆ పార్టీ ప్రకటించింది. అలాగే మిగతా పార్టీలు అభ్యర్థుల కోసం అన్వేషిస్తోంది. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్ నుంచి తెలంగాణ రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్‌గౌడ్‌కు అవకాశం ఇవ్వాలని గులాబీ పార్టీ సిద్ధమైందని తెలిసింది. అంతేకాకుండా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పల్లె రవి కుమార్‌కు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో పని చేసుకోవాలని సూచించినట్టు సమాచారం.
బీఆర్‌ఎస్ ప్లాన్ ఇదే!
అయితే పల్లె రవికుమార్ వామపక్ష ఉద్యమ నేపథ్య కుటుంబం నుంచి వచ్చారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించారు. సీనియర్ జర్నలిస్టుగా ఎన్నో సమస్యలపై అనుభవం ఉంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర కల్లు గీత కార్పొరేషన్ తొలి చైర్మన్ పదవి ఇచ్చారు. అయితే పల్లే రవికుమార్‌కు బీసీ నాయకుడిగా, నల్గొండ-వరంగల్-ఖమ్మం జిల్లాల్లో మంచి పట్టు ఉండడంతో ఆయనకు టికెట్ ఇస్తే పట్టభద్రుల ఎమ్మెల్సీలో విజయం సాధ్యమవుతుందని గులాబీ పార్టీ భావిస్తోందట.
మే 27న పోలింగ్
ఈ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగు సార్లు బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. మొదట కపిలవాయి దిలీప్ కుమార్ రెండు సార్లు, ఆ తర్వాత రెండు సార్లు పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలిచారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఎన్నికైన బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నియోజకవర్గంలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ పదవిలో ఆరేళ్ల పాటు కొనసాగాల్సి ఉండగా.. ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు పల్లా. మండలిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ కావడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక మే2 న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మే 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ జరగనుండగా.. జూన్ 5న ఓట్ల లెక్కింపు జరగనుంది.









