AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

గరీబోళ్ల బిడ్డకు, గడీల వారసులకు మధ్య పోటీ: బండి సంజయ్

కాంగ్రెస్‌లో ప్రధాని అభ్యర్థి ఎవరు? అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ప్రశ్నించారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఓటు వేసిన ఉపయోగం లేదన్నారు. శనివారం ఉదయం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్‌ఆర్‌ఆర్ కాలేజీలో బండి సంజయ్ మార్నింగ్ వాక్ చేశారు. ఈ సందర్భంగా అక్కడ పలువురితో మాట్లాడారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ స్థానానికి ఫైటర్‌కు.. చీటర్స్ కు మధ్య పోటీ జరగనుందన్నారు. గరీబోళ్ల బిడ్డకు, గడీల వారసులకు మధ్య జరుగుతున్న పోటీ అని ఎటువైపు ఉంటారో ప్రజలు ఆలోచించి ఓటేయాలని కోరారు. ఎన్నికలు వచ్చినప్పుడు చుట్టపు చూపుగా వచ్చిపోయే కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రజల కోసం నిత్యం పోరాడే గళానికి మధ్య జరుగుతున్న పోటీలో ఎటువైపు ఉంటారో ఆలోచించుకోవాలన్నారు. బీజేపీ సొంతంగా 370, ఎన్డీఏ కూటమితో కలిసి 400కు పైగా స్థానాలతో మళ్లీ మోడీ హ్యాట్రిక్ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ధీమాను వ్యక్తం చేశారు. తనకు ఓటేసి గెలిపిస్తే దాదాపు రూ.12 వేల కోట్లకుపైగా నిధులు తీసుకొచ్చానని, స్వయంగా ప్రధాని చేతుల మీదుగా జాతీయ రహదారుల విస్తరణ పనులకు శ్రీకారం చుట్టి అనేక అభివృద్ధి పనులు చేశానన్నారు.

ఇండియా కూటమి కెప్టెన్ ఎవరో చెప్పే దమ్ముందా?

గత పదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోయినా మోడీ సహకారంతో వేల కోట్లను కరీంనగర్ అభివృద్ధికి కేటాయించారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఓటమి ఖాయమైందని అందుకే ఇక్కడ పోటీ చేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్ధులు ఒక్కటై నన్ను ఓడించేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. మోడీ పట్ల అసభ్య పదజాలంతో విమర్శలు చేస్తుండటాన్ని కరీంనగర్ సమాజం గుర్తించాలని కోరుతున్నానని వారిద్దరూ ఎన్నడూ ప్రజలను పట్టించుకోలేదన్నారు. ప్రజా సంగ్రామ యాత్రతో 1600 కి. మీలపైగా పాదయాత్ర చేసి ప్రభుత్వ మెడలు వంచానని కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు వందల కోట్లు ఖర్చు పెట్టి గెలవాలని చూస్తున్నానన్నారు. క్రికెట్ భాషలో చెప్పాలంటే దేశంలో ఐపీఎల్ నడుస్తోందని ఎన్డీఏ టీంకు మోడీ కెప్టెన్ అని మరి కాంగ్రెస్ కూటమికి కెప్టెన్ ఎవరో చెప్పే దమ్ముందా అని ప్రశ్నించారు. అందుకే కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మడం లేదని, ఇగ కేసీఆర్‌ను ఎవరూ దేఖే పరిస్థితి కూడా లేదన్నారు. కేసీఆర్ వల్ల నిరుద్యోగులు, రైతులు, ఆర్టీసీ కార్మికులుసహా అన్ని వర్గాల ప్రజలు అల్లాడితే ఎందుకు పట్టించుకోలేదన్నారు. మే 13న జరిగే పోలింగ్‌లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించి పార్లమెంటుకు పంపాలని బండి సంజయ్ కోరారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10