రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజల ముందు తమ మేనిఫెస్టో పెట్టామని, గెలిస్తే ఏం చేస్తామో ప్రజలకు స్పష్టంగా చెప్పామని అన్నారు. దేశ జనాభాను దృష్టిలో ఉంచుకుని రిజర్వేషన్లు అమలు చేశామన్నారు. రాజ్యాంగం ప్రాథమిక సూత్రాలపై బీజేపీ దాడి చేస్తోందన్నారు. రాజకీయ, విద్య. ఉద్యోగ రిజర్వేషన్లను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కేటాయించారని చెప్పారు. 1978లో బీసీలకు రిజర్వేషన్ల కోసం మండల్ కమీషన్ ఏర్పాటు చేశారన్నారు. 1990లో 27 శాతం బీసీ, ఓబీసీ రిజర్వేషన్లు అమలవుతున్నాయన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ అనుకూలమైన వర్గాలు రిజర్వేషన్లను వ్యతిరేకించాయని, మండల్ కమీషన్‌కు వ్యతిరేకంగా పోరాటం చేశారన్నారు. కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు సమాధానం ఏదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రశ్నకు ఇప్పటి వరకు ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పలేదన్నారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని ప్రజలు కోరుతున్నారన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జోడో యాత్రలో ఎక్కువ ఫిర్యాదులు ఇవే వచ్చాయని గుర్తు చేశారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ జనగణన చేస్తామన్నారు.
జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ఇస్పామని చెప్పినట్లు వెల్లడించారు. మోడీ మళ్లీ గెలిస్తే 2025లో రిజర్వేషన్లు ఎత్తివేయడం ఖాయమన్నారు. దేశ మూలవాసులైన ఎస్సీ, ఎస్టీలపై బీజేపీ సర్జికల్ స్ట్రైక్ చేస్తుందన్నారు. ప్రధానమంత్రి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ విధానాలను అమలు చేసేందుకు మోడీ పని చేస్తున్నారని విమర్శించారు.అక్రమంగా 400 సీట్లు సాధించే కుట్ర చేస్తుందన్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేయాలని మాజీ సీఎం కేసీఆర్ ఆనాడు ప్రకటించలేదా అని నిలదీశారు. ఆయన ఎవరి భావాజాలం కోసం పని చేస్తున్నారన్నారు. రిజర్వేషన్ల వైఖరికి బీఆర్‌ఎస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని రద్దు చేస్తామన్న మోడీపై పోరాటం ఏదని ప్రశ్నించారు. అలాగే మల్కాజ్‌గిరిలో ఈటల గెలుస్తాడని ఆ పార్టీ నేత మల్లారెడ్డి అన్నారని గుర్తు చేశారు. ఈ ప్రకటన చాలదా బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటే అని చెప్పడానికి అంటూ వ్యాఖ్యానించారు. మరి ఆ వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదన్నారు. రిజర్వేషన్లు రద్దు కాకుండా ఉండాలంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలువాలని కోరారు.