ఏపీలో ఎన్నికల వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై ఆయన కుమార్తె సునీతారెడ్డితో పాటు విపక్ష నేతలెవరూ మాట్లాడకుండా కడప కోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాలు కలకలం రేపాయి. ముఖ్యంగా కడప లోక్ సభ స్ధానం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న వైఎస్ షర్మిలతో పాటు సునీత కూడా పదే పదే ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్న వేళ వారిని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు దాఖలు చేసిన పిటిషన్ పై కడప కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. దీనిని హైకోర్టులో వైఎస్ వివేకా కుమార్తె సునీతతో పాటు పులివెందుల టీడీపీ అభ్యర్ధి బీటెక్ రవి సవాల్ చేశారు. దీన్ని హైకోర్టులో జస్టిస్ శేషసాయి, జస్టిస్ విజయ్ ల ధర్మాసనం విచారణ జరపాల్సి ఉంది. అయితే అనూహ్యంగా చివరి నిమిషంలో ధర్మాసనంలో న్యాయమూర్తి జస్టిస్ శేషసాయి విచారణ నుంచి తప్పుకున్నారు. మరో బెంచ్ కు ఈ కేసు విచారణ అప్పగించేలా సీజేకు రిఫర్ చేయాలని ఆయన రిజిస్ట్రీని కోరారు. దీంతో ఈ పరిణామం చర్చనీయాంశమవుతోంది.
