చంద్రునిపై మరిన్ని ప్రయోగాలు చేసేందుకు ఉద్దేశించిన ‘చంద్రయాన్-4’ అభివృద్ధి దశలో ఉందని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ వెల్లడించారు. మంగళవారం నాడు పంజాబ్ రాష్ట్రంలో లుధియానాలోని ఓ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ… అంతరిక్ష పరిశోధన అనేది నిరంతర ప్రక్రియ అన్నారు. ఇందులో మన దేశం గొప్ప పురోగతిని సాధిస్తోందన్నారు. చంద్రుడిపై తదుపరి మిషన్‌కు ఇస్రో కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. అంతరిక్ష పరిశోధనతో పాటు వివిధ సాంకేతిక అభివృద్ధి ప్రాజెక్టుల్లో దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులను భాగస్వామ్యం చేసేందుకు ఇస్రో ప్రయత్నిస్తోందన్నారు.
చంద్రయాన్-4 ప్రయోగంలో భాగంగా చంద్రుడిపై నుంచి మట్టి, నీళ్ల నమూనాలను భూమి మీదకు తీసుకు రావాలని ఇస్రో భావిస్తోంది. ఇది దాదాపు 100 రోజులు పని చేసేలా… చంద్రుడిపై కిలో మీటర్ మేర తిరిగేలా రూపొందిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇందుకు రెండు వాహక నౌకలను సిద్ధం చేయాల్సి ఉంటుంది.