AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీజేపీ దొంగల పార్టీ.. ఎన్ని కేసులున్నా మాఫీ చేస్తున్న మోదీ

వాషింగ్‌ మెషిన్‌లా మారిన వైనం
కాంగ్రెస్‌ మేనిఫెస్టో పేదలకు అంకితం
హామీలన్నీ అమలు చేసి తీరుతాం
మల్లికార్జున్‌ ఖర్గే

(అమ్మన్యూస్‌, న్యూఢిల్లీ):
కాంగ్రెస్‌ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోను పేదలకు అంకితం చేస్తున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే స్పష్టం చేశారు. శుక్రవారం బాబూ జగజ్జీవన్‌ రామ్‌ జయంతి సందర్బంగా పార్టీ కార్యాలయంలో ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ వాషింగ్‌ మెషీన్‌లా మారిందని అభివర్ణించారు. ఆ పార్టీలో చేరగానే ఎన్ని కేసులున్నా సరే క్లీన్‌ అయిపోతారని ఎద్దేవా చేశారు. దర్యాప్తు సంస్థలతో బెదిరించి, అటు దొంగలను పార్టీలో చేర్చుకుంటున్నారంటూ బీజేపీ నేతలలపై మల్లిఖార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ నిర్వహించిన జోడో యాత్రలో 5 పిల్లర్లపై దృష్టి పెట్టామని చెప్పారు. అవి యువ న్యాయ్‌, కిసాన్‌ న్యాయ్‌, శ్రామిక న్యాయ్‌. నారీ న్యాయ్‌, హిస్సేదారీ న్యాయ్‌ అని ఆయన వివరించారు. వాటి ఆధారంగా 25 గ్యారంటీలు పొందుపరిచామన్నారు. యువ న్యాయ్‌లో భాగంగా అప్రెంటిస్‌షిప్‌ తప్పనిసరి చేస్తామన్నారు. అప్రెంటిస్‌ చేసేవారికి ఏడాదికి కనీసం రూ.లక్ష లభించేలా పథకాన్ని రూపొందించామని తెలిపారు. ఇక పేద మహిళకు ఏడాదికి రూ.లక్ష మద్దతుగా అందిస్తామన్నారు.

ఇక కిసాన్‌ న్యాయ్‌లో భాగంగా కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామన్నారు. శ్రామిక్‌ న్యాయ్‌లో భాగంగా రూ.400 కనీస కూలీ నిర్ణయిస్తామని చెప్పారు. హిస్సేదారీ న్యాయ్‌లో భాగంగా కులాల వారిగా జన గణన చేస్తామని.. అయితే ఎవరు ఎంత సంఖ్యలో ఉంటే వారికి అంత వాటా దక్కేలా చూస్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

భారతదేశానికి సరికొత్త దశా దిశా నిర్దేశించేలా ఈ మేనిఫెస్టో ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడూ భూమి మీదే నడుస్తుంది తప్పా.. ఆకాశానికి నిచ్చెన వేయలేదన్నారు.. ఇంకా చెప్పాలంటే.. కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడు వాస్తవికతకు చాలా దగ్గరగా ఉందన్నారు. సాధ్యం కానీ లక్ష్యాలు నిర్దేశించుకోలేదని.. అలాగే మేము మోసపూరితంగా వ్యవహరించ లేదన్నారు. అయితే చేయగల్గిందే చెప్పామని.. చెప్పిందే చేసి చూపించామని.. ప్రస్తుతం చేయగల్గిందే మేము ఈ మేనిఫెస్టోలో పొందుపరిచామన్నారు. అందుకోసం ఆయా రంగాల నిపుణులతో సైతం చర్చించామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. వంచిత వర్గాలు, పీడిత, పేద, మహిళ, యువ వర్గాలకు అందకుండా పోయిన న్యాయాన్ని అందిస్తామని పదేళ్ల కాలంలో పేదలకు అందకుండా పోయిన ఫలాలు సైతం అందిస్తామని ఇదే తమ హామీ అని ఆయన స్పష్టం చేశారు.

మోదీ పదేళ్ల పాలనలో పేదల కోసం ఒక్క పని కూడా చేయలేకపోయారని మండిపడ్డారు. గతంలో ప్రధాని నెహ్రూ హయాంలో ఏర్పాటైనట్టు మోదీ హయాంలో పెద్ద పరిశ్రమలు ఏమైనా ఏర్పాటు అయ్యాయా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ హయాంలో అనేక శాస్త్ర, విజ్ఞాన ఆవిష్కరణలు జరిగాయన్నారు. ఈ మోదీ హయాంలో గత ప్రభుత్వాలను తిట్టిపోయడం తప్ప చేసిందేమీ లేదని చెప్పారు.
మోదీ అంటే నిరంకుశం.. నియంతృత్వమని అభివర్ణించారు. వాటిని వదిలించుకోవాలంటే మోదీని గద్దె దించాలన్నారు. . కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన గ్యారంటీలను ప్రతి ఇంటికీ చేర్చాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలపై ఉందన్నారు. ఈ గ్యారంటీలను ఇంటింటికీ తీసుకెళ్లినప్పుడే మార్పు అనేది సాధ్యమవుతుందని అబిప్రాయపడ్డారు. లేదంటే మనం ఆశించే మార్పు సాధ్యం కాదన్నారు. ప్రతీ ఇంటికీ వెళ్లి అర్థమయ్యేలా చెప్పినప్పుడే మన లక్ష్యాన్ని చేరుకోగలమన్నారు. అయితే చందా తీసుకురా.. కాంట్రాక్ట్‌ తీసుకో అన్నదే బీజేపీ విధానమని.. అవినీతి రూపుమాపామని గొంతు చించుకుని మాట్లాడతారని బీజేపీ నేతలపై మల్లిఖార్జున ఖర్గే మండిపడ్డారు.

ANN TOP 10