AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే బీఆర్ఎస్’

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పార్టీ ఫిరాయింపును ప్రోత్సహిస్తున్నాయని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి విమర్శించారు. మొదట పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది బీఆర్‌ఎస్ పార్టీయేనన్నారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కుక్కలు, నక్కలను గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఎందుకు చేర్చుకున్నారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే పంథాను అనుసరిస్తున్నారని దుయ్యబట్టారు. ధైర్యం ఉంటే రాజీనామా చేసి ఇతర పార్టీలోకి వెళ్లాలని సవాల్ విసిరారు. ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రైవేటు వ్యక్తుల ఫోన్లను ట్యాపింగ్ చేసి వారిని బెదిరించి డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. దేశ భద్రతకు భంగం కలిగేలా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉందని, ప్రజాస్వామ్యం, వ్యక్తి స్వేచ్ఛ హరించి వేస్తున్నాయని మండిపడ్డారు. రాజకీయాలకు సంబంధం లేని వారి ఫోన్లను కూడా ట్యాప్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల ప్రమేయం ఉన్నట్లుగా వెల్లడవుతోందన్నారు. ఇది చాలా తీవ్రమైన అంశమని, ఫలితాలు కూడా తీవ్రంగానే ఉంటాయని హెచ్చరించారు. రాజకీయ లబ్ధి పొందేందుకు ఫోన్ ట్యాపింగ్ చేశారన్నారు. ప్రతిపక్షాల ఫోన్లను ఇష్టారాజ్యంగా, అక్రమంగా ట్యాప్ చేశారన్నారు. ఉప ఎన్నికల సమయంలోనూ మా అభ్యర్థులు, నాయకుల ఫోన్లను ట్యాపింగ్ చేశారన్నారు. ఫోన్ ట్యాపింగ్ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని కిషన్ రెడ్డి కోరారు. ఈ మేరకు తాము కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. కేసీఆర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.

ANN TOP 10