ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణను ఈనెల 4వ తేదీకి వాయిదా వేసింది రౌస్ అవెన్యూ కోర్టు. చిన్న కుమారుడి పరీక్షలు ఉన్నందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేశారు కవిత. ఈనెల 16వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. కవిత పిటిషన్‌ను విచారించిన కోర్టు ఈడీకి నోటీసులు జారీ చేసింది.
అయితే కవిత బెయిల్ పిటిషన్‌ను ఈడీ వ్యతిరేకించింది. ఈడీ కౌంటర్‌కు సమాధానం ఇచ్చేందుకు సమయం కోరారు సింఘ్వీ. ఈనెల 3వ తేదీ సాయంత్రం సమాధానం ఇస్తామని తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మార్చి 15వ తేదీన ఈడీ కవితను అరెస్ట్ చేసింది. 10 రోజుల పాటు ఈడీ కస్టడీలో కవితను విచారించారు. ప్రస్తుతం ఆమె తిహార్ జైల్లో ఉన్నారు.
తిహార్ జైల్లో ఉన్న కవితకు ఇంటి భోజనం , పుస్తకాలు , షూ అందించాలని మరోసారి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గతంలో కూడా ఇదే ఆదేశాలు జారీ చేసినప్పటికి జైలు అధికారులు పాటించలేదని కవిత కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు వెంటనే సౌకర్యాలు కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. కవితకు ధ్యానం చేసుకోవడానికి జపమాలను కూడా కోర్టు అనుమతి ఇచ్చింది.









