హైదరాబాద్ : కే కేశవరావు, కడియం శ్రీహరి గత పదేండ్లు పార్టీలో అనేక పదవులు అనుభవించి ఇవాళ పార్టీ నుంచి జారుకున్నారని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
కష్టకాలంలో బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటానని చెప్పి ఇవాళ కాసాని జ్ఞానేశ్వర్ ముందుకు వచ్చారు. అవకాశం ఇస్తే చేవెళ్లలో నేను నిలబడుతానని చెప్పారు. దీంతో కేసీఆర్ ఆయనకు అవకాశం కల్పించారు. కాసాని ధీరోదాత్తమైన నాయకుడు. బలహీన వర్గాల ముద్దుబిడ్డ, బడుగుల ఆశాజ్యోతి అని చాలా మంది అనేక ప్రసంగాలు ఇచ్చారు. అలా బీసీ జాతి కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్. ఒక్క రంగారెడ్డి జిల్లాకే కాదు.. రాష్ట్రం మొత్తానికి ఆయన సుపరిచితుడు. ముదిరాజ్‌లకు ఎంతో సేవ చేశారు అని కేటీఆర్ తెలిపారు.
కష్టకాలంలో మన కోసం వచ్చిన కాసాని జ్ఞానేశ్వర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి. మన కష్టంలో ఉంటే పెద్ద పెద్ద నాయకులు కే కేశవరావు, కడియం శ్రీహరి పార్టీ నుంచి జారుకుంటున్నారు. ఈ సమయంలో ధీరోదాత్తంగా నిలబడి నేనున్నా అంటూ ముందుకు వచ్చిన నాయకుడిని కడుపులో పెట్టుకోవాల్సిన బాద్యత మనపై ఉంది. చేవెళ్లలో నిలబడ్డది కేసీఆర్.. అనుకొని కొట్లాడుదాం. ఆయన కోసం ఓటేస్తాం అనే కమిట్మెంట్తో పని చేద్దాం. పదేండ్లు పదవులు అనుభవించిన తర్వాత.. పోయేవాళ్లు రెండు రాళ్లు వేసి పోతారు. అది వారి విజ్ఞతకే వదిలేద్దాం.. కాలమే సమాధానం చెప్తుందని కేటీఆర్ అన్నారు.