AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

దమ్ముంటే ఇప్పటికైనా రా.. మల్కాజిగిరిలో పోటీ చేద్దాం.. సీఎం రేవంత్‌కు కేటీఆర్‌ సంచలన సవాల్‌

(అమ్మన్యూస్‌, హైదరాబాద్‌):
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మరోసారి సవాల్‌ విసిరారు. దమ్ముంటే రాజీనామా చేసి.. ఎంపీ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి పోటీ చేయాలని రేవంత్‌కు కేటీఆర్‌ ఛాలెంజ్‌ చేశారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మల్కాజిగిరి పార్లమెంట్‌ సమావేశంలో కేటీఆర్‌ పాల్గొని ప్రసంగించారు.

‘బీఆర్‌ఎస్‌ పని అయిపోయింది.. కేసీఆర్‌ శకం ముగిసింది. ఒక్క ఎంపీ సీటు కూడా గెలవరు అని రేవంత్‌ రెడ్డి అంటున్నారని, దమ్ముంటే ఒక్క సీటు గెలిచి చూపెట్టు అని నాకు రేవంత్‌ సవాల్‌ విసిరారు. రేవంత్‌ రెడ్డి నువ్వు గొప్పోడివి కాదా..? ఒక్క సీటు కూడా గెలవరు అన్నావు కదా.. మల్కాజిగిరి సీటులో పోటీ చేద్దాం. తేల్చుకుందాం రా అని అన్నాను. కానీ స్పందన లేదు. మళ్లీ నోరు ఎత్తలేదు’ అని కేటీఆర్‌ గుర్తు చేశారు.

రేవంత్‌ రెడ్డి పిరికోడు..
‘మల్కాజిగిరిలో రేవంత్‌ ఒక్క పని చేయలేదు. ఎవర్నీ పలకరించిన పాపాన పోలేదు. కాబట్టి ఆవేశానికి పోతే ఓడిపోతానని రేవంత్‌ భయపడ్డాడు. అందుకే ఉలుకుపలుకు లేదు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మల్కాజిగిరిలో నిలబడేందుకు భయపడుతున్నాడు. ఏప్రిల్‌ 18న నామినేషన్లు.. సమయం చాలా ఉంది కాబట్టి రేవంత్‌కు ధైర్యం వచ్చి రాజీనామా చేసి వస్తే నేనూ వస్తా.. తప్పకుండా నిలబడుతాను. నాకు తెలుసు ఆయన రాడు.. పిరికోడు. నరుకుడు ఎక్కువ.. అసలు విషయానికి వస్తే పారిపోతాడు. చాలా పెద్ద మాటలు, డైలాగులు చెబుతాడు. కానీ ఆచరణలో మాత్రం చూపించడు’ అని కేటీఆర్‌ ధ్వజమెత్తారు.

ప్రచారం ముమ్మరం చేయాలి
మల్కాజిగిరిలో జరిగే పోటీ.. కేవలం వ్యక్తుల మధ్య కాదని, పోటీ మూడు పార్టీల మధ్య అని కేటీఆర్‌ అన్నారు. కేసీఆర్‌ నిలబడ్డారని భావించి పని చేయాలన్నారు. ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలన్నారు. కార్పొరేట్‌ ఎన్నికల్లో మాదిరిగానే ప్రతి ఇంటికి వెళ్లాలని, దేశంలోనే అత్యంత పెద్ద నియోజకవర్గం మల్కాజిగిరి అని, ప్రతి వాడ తిరిగి ప్రచారం చేయాలని కేటీఆర్‌ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

ANN TOP 10