కూతురు క్లింకార తలనీలాలు సమర్పణ
నేడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఉదయం తిరుమల శ్రీవారిని రామ్ చరణ్ దంపతులు దర్శించుకున్నారు. కూతురు తలనీలాలు సమర్పించేందుకు తిరుమలకు వచ్చిన రామ్ చరణ్ దంపతులు నిన్నరాత్రి తిరుపతి చేరుకున్నారు. అంతకు ముందు శ్రీవారి దర్శనార్థం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న చరణ్ దంపతులకు, కుటుంబ సభ్యులుకు అభిమానులు ఘన స్వాగతం పలికారు.
కొన్నాళ్లుగా గేమ్ ఛేంజర్ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న చరణ్.. ఇప్పుడు పుట్టినరోజు సందర్భంగా తిరుమలకు చేరుకున్నారు. రామ్ చరణ్ ను చూసేందుకు ఫ్యాన్స్ భారీగా విమానాశ్రయం చేరుకున్నారు. నిన్న రాత్రి రోడ్డు మార్గంలో తిరుమల చేరుకున్నారు చరణ్ దంపతులు.
బుధవారం తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సుప్రభాత సేవలో శ్రీవారి దర్శనం చేసుకున్నారు. కూతురు క్లింకార తలనీలాలు సమర్పించి శ్రీవారికి మొక్కులు తీర్చుకున్నారు రామ్ చరణ్ ఉపాసన దంపతులు.
టీటీడీ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేయగా రంగనాయకుల మండపంలో రామ్‌చరణ్ దంపతులకు వేద పండితులు తీర్థప్రసాదాలు, ఆశీర్వచనం అందించారు. అనంతరం రామ్ చరణ్ ఫ్యామిలీ తిరుమల నుంచి హైదరాబాద్ తిరుగు ప్రయాణం అయ్యారు.