ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గీత దాటుతున్నారంటూ ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. సజ్జల రామకృష్ణారెడ్డిపై ఎన్నికల సంఘానికి టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ సలహాదారు పదవిలో ఉంటూ సజ్జల రాజకీయ నేతలా మాట్లాడుతున్నారని ఏపీ సీఈవో ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం జీతం తీసుకుంటూ వైసీపీ కోసం పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. గత ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వ సలహాదారుగా కాకుండా.. అధికార పార్టీ కార్యకర్తలా ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తున్నారని లేఖ రాశారు.
మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి విపక్షాలపై ఆరోపణలు చేశారని, ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘనే అని ఆయన ఆరోపించారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన సజ్జల రామకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఆయనను పదవి నుంచి తొలగించాలని కోరారు. సజ్జల ఓ వైసీపీ కార్యకర్తలా విపక్షాలపై విషం చిమ్ముతున్నారని వివరించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన సజ్జలపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు కోరారు.