భూ కబ్జా ఆరోపణలపై మాజీ ఎంపీ, బీఆర్‌ఎస్ నేత జోగినపల్లి సంతోష్ కుమార్ స్పందించారు. షేక్‌పేటలో స్థలాన్ని చట్టబద్దంగా కొనుగోలు చేసినట్లు స్పష్టం చేశారు. తనకు ఇంటి స్థలాన్ని అమ్మిన శ్యాంసుందర్ ఆ భూమిని 1992 లో సేల్ డీడ్ నంబర్ 1888/1992 ద్వారా కొనుగోలు చేశారని, అప్పటి నుంచి ఎలాంటి న్యాయ వివాదాలు లేవని ఆయన స్పష్టంగా తెలియజేశారన్నారు. అంటే దాదాపు 32 ఏళ్లుగా ఆ భూమిపై ఎలాంటి న్యాయ వివాదాలు లేవన్నారు. కొనుగోలు చేసిన తర్వాత ఆ భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదని, శ్యాంసుందర్ అంతకన్నా ముందు వాళ్లు చేపట్టిన నిర్మాణాలే కొనసాగుతున్నాయన్నారు. వివాదాస్పద ఇంటి స్థలం 1350 గజాలు అని పోలీసులు, మీడియా పేర్కొంటున్నారని, కానీ తాను కొనుగోలు 904 గజాల ఇంటి స్థలం మాత్రమేనన్నారు.
ఇది రాజకీయ దురుద్దేశంతో నమోదు చేసిన కేసు అని స్పష్టంగా అర్థమవుతుందన్నారు. బాజాప్తా డబ్బులు పెట్టి కొన్న ఆస్తిపై అనవసర నిందలు వేస్తూ ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఎలాంటి కబ్జాలకు పాల్పడలేదని, న్యాయపరంగా ఎదుర్కోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు.. సిద్ధంగా ఉన్నానని చెప్పారు. 32 సంవత్సరాలుగా లేని వివాదం కొత్తగా ఇప్పుడు ఎందుకు తెర మీదకు వచ్చిందో సులభంగా అర్థం చేసుకోవచ్చన్నారు. తమ పార్టీపై, తనపై రాజకీయ కక్షతో బురద జల్లాలని చూస్తే సహించేది లేదని, తప్పుడు ఆరోపణలు చేసి వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించాలని చూస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మాజీ ఎంపీ సంతోష్ కుమార్ తెలిపారు.