హైదరాబాద్: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar) ను కలిసి దానం నాగేందర్ (Daanam Nagendar)పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలు కోరారు. ఈ మేరకు స్పీకర్‌కు వినతిపత్రం సమర్పించారు. స్పీకర్‌ను కలిసిన వారిలో పాడి కౌశిక్ రెడ్డి (Padi Koushik Reddy), ముఠా గోపాల్, బండారి లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేష్ ఉన్నారు. ఈ సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. దానం నాగేందర్ ను డిస్ క్వాలి ఫై చేయాలని స్పీకర్ ను కలిసి పిటిషన్ ఇచ్చామన్నారు. స్పీకర్ నిర్ణయం తీసుకుంటా అన్నారని తెలిపారు.
ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలో చేరిన వారిని రాళ్లతో కొట్టాలని గతంలో రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్న విషయాన్ని ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి గుర్తు చేశారు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారిని రాళ్లతో కొడతారా? అని ప్రశ్నించారు. దానంను బీడీలు అమ్ముకునే వారని రేవంత్ అన్నారని.. మరి అలాంటి వ్యక్తిని ఎందుకు చేర్చుకున్నారని ప్రశ్నించారు.
ఆదివారం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఏఐసీసీ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఇద్దరూ ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దాంతో దానంపై అనర్హత వేటు వేయాలని ఇవాళ గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలిసి పిటిషన్ ఇచ్చారు. అయితే ఈ పిటిషన్‌పై స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.









