AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

11న మణుగూర్‌కు సీఎం రేవంత్.. ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 11న మణుగూరు రానున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని భద్రాద్రి వేదికగా ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మణుగూరులో జరిగే భద్రాద్రి ప్రజా దీవెన బహిరంగ సభలో పాల్గొని దుమ్మురేపనున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ఐదో గ్యారంటీ ఇళ్ల పథకాన్ని భద్రాద్రి జిల్లాలో శ్రీకారం చుట్టాలని డిసైడయ్యారు. రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జిల్లాలోనే తొలిసారి మణుగూరుకు తీసుకువస్తున్నారు. తన శిష్యుడైన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నియోజకవర్గంలో సభ ఏర్పాటుచేసి.. అటు ప్రభుత్వపరంగా, ఇటు వచ్చే లోక్ సభ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించేందుకు పొంగులేటి వ్యూహరచన చేశారు. సీఎంగా తొలిసారి జిల్లాలో పర్యటిస్తున్న రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా వరాలు ప్రకటిస్తారని ప్రజలు ఎదురుచూస్తున్నారు.

ఈ సందర్భంగా శుక్రవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల, ఐటీడీఏ పీవో ప్రతిక్ జైన్, ఎస్పీ రోహిత్, జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇతర క్యాబినెట్ మంత్రులతో కలిసి భద్రాచలం పర్యటించనున్నారని తెలిపారు. సీతారామ చంద్ర స్వామి వారిని దర్శించుకుని, మిథిలా స్టేడియంలో ఏర్పాటు చేసిన జిల్లా అధికారుల సమీక్షా సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. అక్కడే ఏర్పాటు చేసిన సభలో మూడు వేల మంది ప్రజల సమక్షంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. ఆ తర్వాత మణుగూరులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారని పేర్కొన్నారు. హెలిపాడ్ ఏర్పాట్లు, భద్రత ఏర్పాట్లు, క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని ఎస్పీతో మాట్లాడారు. హెలిపాడ్ వద్ద అంబులెన్స్, డాక్టర్లు, ఫైర్ ఇంజన్, మొదలగు అత్యవసర ఏర్పాట్లు చేయాలన్నారు. ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్‌తో మాట్లాడుతూ.. కళ్యాణ మండపం వద్ద ఎలక్ట్రిక్ జనరేటర్, ఏసీల ఏర్పాటు, వాహనాల పార్కింగ్ కొరకు వసతి ఏర్పాట్లు పర్యవేక్షించాలని సూచించారు.

ముఖ్యమంత్రి దైవదర్శనం, సమీక్షా సమావేశం, ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభోత్సవానికి వచ్చే ప్రజలకు సిట్టింగ్ అరేంజ్మెంట్, మంచి నీటి వసతి, పరిశుద్ధ శాఖాహార భోజన ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆర్డీవో భద్రాచలంను ఆదేశించారు. అలాగే భద్రాచలం దేవస్థానం అభివృద్ధి పనులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సిద్ధం చేసుకోవాలని దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమాదేవిని ఆదేశించారు. ఈ టెలి కాన్ఫరెన్స్ లో డీఆర్ఓ రవీంద్రనాథ్, డీఆర్‌డీవో విద్యాచందన, జిల్లా పరిపాలన అధికారి గన్య, భద్రాచలం ఆర్టీవో కే దామోదర్ రావు, కొత్తగూడెం ఆర్డీవో మధు, ఆర్అండ్‌బీఈఈ వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ ఈ ఈ శ్రీనివాసరావు , ఎక్సైజ్ సూపర్డెంట్ జానయ్య, ఇరిగేషన్ ఈఈ అర్జున్‌తో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10