లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపించిన నేపథ్యంలో- కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తన ప్రచార కార్యక్రమాలకు ముమ్మరం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా బరిలో దిగారు. వివిధ రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటిస్తోన్నారు. ప్రస్తుతం ఆయన తెలంగాణలో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ ఉదయం ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు.. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. మరికొన్నింటిని ప్రారంభించారు. అనంతరం బీజేపీ రాష్ట్రశాఖ ఏర్పాటు చేసిన విజయ సంకల్పయాత్రలో పాల్గొన్నారు.
తన పర్యటన సందర్భంగా రాత్రి రాజ్‌భవన్‌లో బస చేశారు ప్రధాని మోదీ. మంగళవారం ఉదయం సంగారెడ్డికి వెళ్తారు. వివిధ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడే బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. వాటి విలువ 15,718 కోట్ల రూపాయలు. తెలంగాణ పర్యటన అనంతరం ఒడిశాకు తరలి వెళ్తారు. తన పర్యటనలో భాగంగా మోదీ మంగళవారం ఉదయం సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఉదయం 8 గంటలకు ఆయన రాజ్‌భవన్ నుంచి బయలుదేరి, రోడ్డు మార్గంలో మహంకాళి అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. ప్రత్యేక పూజలు చేస్తారు. పట్టుచీరె, ఇతర కానుకలను అమ్మవారికి సమర్పిస్తారు.









