మేడారం మహాజాతరలో చివరి ఘట్టమైన తిరుగువారం పండుగను బుధవారం నిర్వహించనున్నారు. సమ్మక్క-సారలమ్మ తిరుగువారం పండుగను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. తిరుగువారం పండుగతో మేడారం మహాజాతర పూర్తిగా ముగిసినట్లు పూజారులు ప్రకటిస్తారు. పూజా మందిరాలను శుద్దిచేసి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వాటికి పూజారులు తాళాలు వేస్తారు. సమ్మక్క-సారలమ్మ ఉత్సవాలు మండమెలిగే పండుగతో ప్రారంభమై.. తిరుగువారంతో ముగుస్తాయి. తిరిగి వచ్చే ఏడాది మాఘమాసంలో మినీ జాతర సందర్భంగా పూజా సామగ్రిని బయటకు తీసి పూజలు చేయనున్నారు.
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం జాతరకు నాలుగు రోజుల్లో కోటి 45 లక్షల మంది వచ్చినట్టు అధికారులు ప్రకటించారు. ఈ మహాజాతర నాలుగు రోజుల పాటు కన్నుల పండువగా సాగింది. జాతరలో కీలక ఘట్టమైన సమ్మక్క వన ప్రవేశంతో పరిసమాప్తమైంది. గద్దెపై నుంచి చిలకలగుట్టకు సమ్మక్క, కన్నెపల్లికి సారలమ్మ, పూనుగొండ్లకు పగిడిద్దరాజు, కొండాయికి గోవిందరాజు పయనమయ్యారు. ఈ ఏడాది వన దేవతలు గద్దెలు విడిచే సమయంలో మేడారంలో వర్షం కురవడం విశేషం. వర్షాన్ని శుభ సూచకంగా భావించిన భక్తులు జయజయ ధ్వానాలు చేస్తూ వనదేవతలకు ఘనంగా వీడ్కోలు పలికారు.