AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి వల్లే మేడిగడ్డ దెబ్బతింది..

ప్రమాదంలో మేడిగడ్డ, అన్నారం, సుంధిళ్ల
– కేసీఆర్‌ పాలన అంతా అవినీతి మయమే
– ఇంత అవినీతి జరగడం దేశంలోనే ఇదే ప్రథమం
– నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి
– అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల

అమ్మన్యూస్‌ ప్రతినిధి, హైదరాబాద్‌:
మేడిగడ్డ బ్యారేజ్‌ పనికిరాదని, అన్నారం, సుంధిళ్ల బ్యారేజ్‌ల నిర్మాణంలోనూ క్వాలిటీ లేదని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తేల్చిపారేశారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీ కూడా కుంగిపోయే ప్రమాదంలో ఉన్నాయని, బొందల గడ్డలను తలపిస్తున్నాయని అన్నారు. గత∙కేసీఆర్‌ పాలన అంతా అవినీతి మయమేనని అన్నారు. శనివారం అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్‌ సాగునీటి ప్రాజెక్టుల (ఇరిగేషన్‌)పై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా శ్వేత పత్రం విడుదల చేశారు.

2014 వరకు నీటి పారుదల సామర్థ్యం 57.79 లక్షల ఎకరాలు ఉంటే.. మొత్తం ఖర్చు 54,234 కోట్లు అని అన్నారు. 2014 వరకు ఒక్కో ఎకరానికి 93వేల కోట్లు ఖర్చు అయిందని తెలిపారు. 2014 నుంచి 2023 వరకు పదేళ్లలో ఇరిగేషన్‌ ఖర్చు 1.81లక్షల కోట్లు. బీఆర్‌ఎస్‌ హయాంలో కొత్త ఆయకట్టు 15.81 లక్షల ఎకరాలు.. బీఆర్‌ఎస్‌ హయాంలో ఒక్కో ఎకరం ఖర్చు 14.45 లక్షలు అని ఉత్తమ్‌ తెలిపారు.

మేడిగడ్డ పనికిరాదు..
మేడిగడ్డ ప్రాజెక్టు బాగా దెబ్బతిందని ఉతమ్‌ అన్నారు. మేడిగడ్డ పనికి రాదు అని నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ స్పష్టం చేసిందని, అక్టోబర్‌ లో మేడిగడ్డ కుంగితే కేసీఆర్‌ ఇప్పటిదాకా స్పందించలేదని ఉత్తమ్‌ అన్నారు. అవినీతి, నిర్లక్ష్యం వలల బ్యారేజ్‌ బాగా దెబ్బతింది.. గత ప్రభుత్వ పెద్ద మనిషే చీఫ్‌ ఇంజనీర్, డిజైనర్‌. గత పదేళ్లలో ఇరిగేషన్‌ శాఖలో జరిగిన అవినీతి మరెక్కడా జరగలేదని ఉత్తమ్‌ చెప్పారు. ఇంత అవినీతి స్వతంత్ర భారతంలో ఇప్పటిదాకా జరగలేదన్నారు. యావత్‌ తెలంగాణ ప్రజలకు బీఆర్‌ఎస్‌ క్షమాపణలు చెప్పాలని ఉత్తమ్‌ అన్నారు. మేడిగడ్డ మాత్రమే కాదు.. అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌ ల నిర్మాణంలోనూ క్వాలిటీ లేదన్నారు. అన్నారానికి కూడా పగుళ్లు వచ్చాయని. అన్నారం బ్యారేజీ కూడా ప్రమాదంలో ఉంది, అన్నారం బ్యారేజీలో నిన్నటి నుంచే లీకులు మొదలయ్యాయని ఉత్తమ్‌ చెప్పారు. వెంటనే ఎన్డీఎస్‌ఏకీ సమాచారం అందించాం. నీటిని నింపొద్దని ఎన్డీఎస్‌ఏ చెబుతోంది. ఉన్న నీటిని తొలగించాలని చెప్పిందని ఉత్తమ్‌ అన్నారు.

కరెంట్‌ కోసం ఏకంగా.. రూ.10వేల కోట్లు..
కాళేశ్వరం విషయంలో విస్తూపోయే విషయాలు చెప్పిందని ఉత్తమ్‌ పేర్కొన్నారు. కరెంట్‌ కోసం ఏడాదికి రూ.10 వేల కోట్ల ఖర్చు అవుతుందన్నారు. డీపీఆర్‌ అఫ్రూవ్‌ కాకుండానే కాంట్రాక్టర్లకు రూ.20 వేల కోట్లు కట్టబెట్టిందని. కాగ్‌ సూచించిన అంశాల పై ఖచ్చితంగా విచారణ చేపడతామని ఉత్తమ్‌ స్పష్టం చేశారు.

నట్టేట ముంచిన గత ప్రభుత్వ నిర్ణయాలు..
గత ప్రభుత్వ నిర్ణయాలు.. తెలంగాణను నట్టేటా ముంచాయని, కాళేశ్వరం తెలంగాణకు గుదిబండగా మారిందని ఉత్తమ్‌ అన్నారు. ‘ఎస్సారెస్సీ పునరుజ్జీవన ప్రాజెక్టుతో ఒరిగిందేం లేదు. గతంలో పోలిస్తే.. ఎకరాకు 12 రెట్లు ఖర్చు పెరిగింది. ఆర్థిక క్రమశిక్షణతో ప్రాజెక్టులను నిర్వహించాలి. అంతేకానీ అడ్డగోలు అవినీతి, నిర్లక్ష్యంతో కాదు. గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని మేం సవరిస్తాం.’ అని ఉత్తమ్‌ సభలో వెల్లడించారు.

సభ్యులకు స్పీకర్‌ స్వీట్‌ వార్నింగ్‌ ..
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే అధికార, విపక్ష నేతల మధ్య వాదోపవాదనలు చోటు చేసుకున్నాయి. మంత్రి ఉత్తమ్‌ అసెంబ్లీలో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా శ్వేతపత్రం విడుదల చేశారు. అయితే, హరీశ్‌ రావు మాట్లాడుతూ.. మెంబర్‌ కాకుండా సభలోకి ఇతరులు రాకూడదని స్పీకర్‌ దృష్టికి తీసుకెళ్లారు. అడ్వకేట్‌ జనరల్‌ తప్ప మరో వ్యక్తి రావొద్దని, టెక్నీషియన్‌ ను సభలోకి అనుమతించ వద్దని హరీశ్‌ రావు అన్నారు. మంత్రి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వాలిఅంటే టెక్నీషియన్‌ను బయటకు పంపాలని హరీశ్‌ రావు స్పీకర్‌ దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి శ్రీధర్‌ బాబు కల్పించుకొని.. గతంలో సభలో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, టెక్నీషియన్‌ ద్వారా నే ఇచ్చారని గుర్తుచేశారు. స్పీకర్‌ అనుమతితోనే టెక్నీషియన్‌∙సభ లోపలికి వచ్చారని శ్రీధర్‌ బాబు తెలిపారు. స్పీకర్‌ మాట్లాడుతూ.. అన్ని రికార్డులను పరిశీలించి టెక్నీషియన్‌ను సభలోకి అనుమతించామని సభ్యులకు క్లారిటీ ఇచ్చారు. గతంలో సీఎంగా కేసీఆర్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చినప్పుడు సభలోనే టెక్నీషియన్‌ ఉన్నాడు. నేను టెక్నీషియన్‌కు అనుమతి ఇస్తున్నా.. నన్ను ఎవరూ ప్రశ్నించొద్దు అంటూ సభ్యులకు స్పీకర్‌ స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చారు.

ANN TOP 10