టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘతన సాధించాడు. టెస్ట్ క్రికెట్‌లో 500 వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో చేరిపోయాడు. రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలేను అవుట్ చేయడం ద్వారా అశ్విన్ ఈ అరుదైన మైల్‌స్టోన్‌ను అందుకున్నాడు. టీమిండియా నుంచి 500 టెస్ట్ వికెట్లు సాధించిన రెండో బౌలర్‌గా జాబితాలో నిలిచాడు. ఆ జాబితాలో అనిల్ కుంబ్లే తొలి స్థానంలో ఉండగా.. అశ్విన్ రెండో స్థానంలో ఉన్నాడు. అదే విధంగా ప్రపంచ వ్యాప్తంగా 9వ బౌలర్‌గా అశ్విన్ చరిత్ర సృష్టించాడు. అంతేకాకుండా టీమిండియా నుంచి 500 టెస్ట్ వికెట్ల మార్క్‌ను అందుకున్న మొట్టమొదటి ఆఫ్ స్పిన్నర్‌గా అశ్విన్ చరిత్ర సృష్టించాడు.
ఇక టీమిండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ రసవత్తంగా నడుస్తుంది. రెండో ఆట ముగిసే సమయానికి టీమిండియా భారీ ఆధిక్యంలో ఉంది. రాజ్‌కోట్ టెస్టులో టీమిండియా భారీ స్కోరుకు ఇంగ్లండ్ దీటుగా బదులిస్తోంది. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 445 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇంగ్లాండ్ ఇంకా 238 పరుగులు వెనుకబడింది. తమ బజ్‌బాల్ స్టైల్లో ఆ టీమ్ ఓపెనర్ బెన్ డకెట్ మెరుపు సెంచరీ చేయడంతో ఇంగ్లాండ్ టీమ్ రెండో రోజు 2 వికెట్లకు 207 రన్స్ చేసింది. డకెట్ 133, రూట్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు.









