రాష్ట్రంలో కుల గణన కోసం అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానానికి శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా శుక్రవారం బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఆ తర్వాత సభ్యులందరూ చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కులగణన తీర్మానం తెలంగాణ ఏర్పాటు తర్వాత అతి పెద్ద విజయమని అన్నారు. రాష్ట్రంలోని ప్రజలు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా మెరుగుపడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. బలహీన వర్గాలకు న్యాయం జరిగే విధంగా గైడ్ లైన్స్ ఇస్తామన్నారు. రాజకీయ పార్టీలతో పాటు అందరి సహకారం తీసుకుంటామని, బలహీన వర్గాలకు న్యాయం జరగాలన్నదే తమ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
కులగణన ఏ విధంగా చేస్తారు: గంగుల కమలాకర్
అసెంబ్లీలో కుల జనగణనపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడారు. బీసీ కులగణన తీర్మానం కాదని, చట్టం చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు కులగణన చేస్తే.. బీసీ కులాలే నష్టపోతాయని చెప్పారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా కులగణన చట్టం చేయాలని కోరారు. కులగణన ఏ విధంగా చేస్తారో ముందే స్పష్టం చేయాలని చెప్పారు. కేంద్రం పరిధిలోని అంశంపై రాష్ట్రం ఎలా చట్టం చేస్తుందని ప్రశ్నించారు. రిజర్వేషన్లు 50 శాతం మించి పోతే ఏం చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
మద్దతు ఇవ్వకుండా రన్నింగ్ కామెంట్రీలు ఎందుకు?: భట్టి
మాజీ మంత్రి గంగుల కమలాకర్ జరిపిన చర్చల తర్వాత డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడారు. అసెంబ్లీలో బీసీ కులగణన తీర్మానం ప్రవేశ పెట్టడం దేశ చరిత్రలోనే చారిత్మాక మని చెప్పారు. దేశంలో ఉన్న సంపద, రాజ్యాధికారం దామాషా ప్రకారం దక్కాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ప్రస్తావించినట్లు గుర్తు చేశారు. అలాగే దేశ వ్యాప్తంగా కులగణన చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కులగణన చేస్తామని ఎన్నికల్లో చాలా స్పష్టం చెప్పామని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా కులగణనతో పాటు సోషల్, ఎకనామిక్, ఎడ్యుకేషన్, పొలిటికల్, ఎంప్లాయిమెంట్ అంశాలపై సర్వే జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటిని, అన్ని కులాలు, ఆర్థిక స్థితిగతులపై సర్వే చేస్తామన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉండి కులగణన చేయాలేదని, ఇప్పుడు తాము చేస్తామంటే మద్దతు ఇవ్వకుండా రన్నింగ్ కమెంట్రీ చేయడం సరికాదని సూచించారు. సర్వేలో అన్ని వివరాలు పొందుపరుస్తామని డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
కులగణన ఆహ్వానిస్తాం: కడియం శ్రీహరి
కులగణనను తాము ఆహ్వానిస్తున్నట్లు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. కానీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానంలో స్పష్టత లేదని అభిప్రాయపడ్డారు. కులగణనపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జన, కులం అంటూ ద్వంద్వ వైఖరి కనిపిస్తుందని, జన గణన చేసే హక్కు రాష్ట్రానికి లేదని, కులగణన చేసే హక్కు మాత్రమే ఉందని వ్యాఖ్యానించారు. ఎలాంటి చట్టబద్ధత లేకుండా తీర్మానం ప్రవేశ పెడితే లాభం ఉందని, కులగణన చేపట్టి ఆయా రాష్ట్రాలు ఇబ్బందులు పడ్డాయని.. న్యాయపరంగా ముందుకు వెళ్లాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి చెప్పుకొచ్చారు.
కులగణనపై అనుమానాలు వద్దు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
కులగణనపై ప్రజలకు అనుమానం లేవనెత్తేలా విపక్షాలు వ్యాఖ్యలు చేస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కుల గణన తీర్మానం చర్చలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. చట్ట సభల్లో అన్ని కులాలకు న్యాయం చేసేలా కులగణన చేపడుతామని చెప్పారు. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో జస్టిస్ కమిటీ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. సమగ్ర కుటుంబ సర్వే చేశామని బీఆర్‌ఎస్ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని, ఆ సమగ్ర సర్వే చట్ట సభలో ప్రవేశ పెట్టారా అని ప్రశ్నించారు. ఎన్నికల కోసమే బీఆర్‌ఎస్ అప్పుడు తప్పుడు సర్వేలు వాడుకుందని మండిపడ్డారు. తమకు రాజకీయ దురుద్దేశాలు లేదని, కులగణనపై అనుమానాలు వద్దని సూచించారు. కులగణనపై అనుమానాలు ఉంటే సలహాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తీర్మానంలో లీగల్ చిక్కులు ఉంటే ప్రతిపక్షాలు తీర్మానం అమలు అయ్యే విధంగా సహకరించాలని అభిప్రాయపడ్డారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరిని ఆయన పార్టీ నేతలే తప్పు తొవ్వ పట్టిస్తున్నారని అన్నారు. మేనిఫెస్టోలపై ఒకరోజు చర్చ పెడుదామని, 2014, 2018, 2023 మేనిఫెస్టోలపై ప్రత్యేకంగా చర్చింద్దామని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే మంత్రివర్గ నిర్ణయంతో తీర్మానం ప్రవేశ పెడుతున్నామని తెలిపారు. గత పదేళ్లు అధికారంలో ఉండి మీరేం చేశారు.. అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లో మేము ఏం చేశామన్నది చర్చిద్దామని చెప్పుకొచ్చారు. సభలో తీర్మానం ప్రవేశపెట్టిందని తామేనని, రాష్ట్రంలోని బలహీన వర్గాలను కూడా బలంగా మార్చే ఉద్దేశమని పేర్కొన్నారు. బాధితులుగా ఉన్న వాళ్లను పాలకులుగా చేయాలన్నదే తమ ఆలోచన అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.









