రూ.లక్ష కోట్లు లూటీ చేసిన కేసీఆర్‌ను అరెస్టు చేయాల్సిందే
బీజేపీ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ డిమాండ్
అమ్మన్యూస్, హైదరాబాద్:
మేడిగడ్డ అవినీతికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అరెస్ట్ చేయాలని బీజేపీ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. లక్ష కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన కేసీఆర్ కుటుంబం నుంచి ఆస్తులు జఫ్తు చేయాలన్నారు. గురువారం ఆయన సిరిసిల్లలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య పొత్తు ఉండదని స్పష్టం చేశారు.
ఎన్నికల సమయంలో దుష్ప్రచారం
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ, బీఆర్‌ఎస్ పొత్తు అనే ప్రచారం చేయడం పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు కేసీఆర్ మరోసారి పొత్తుపై అబద్దపు ప్రచారం చేస్తున్నారన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ 400 స్థానాలు గెలుచుకుంటామని… అలాంటి సమయంలో బీఆర్‌ఎస్ పార్టీతో మాకు పొత్తు ఎందుకు? అలాంటి అవసరమే లేదన్నారు. బీఆర్‌ఎస్ మునిగిపోయే నావ అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో మూడోస్థానానికి పడిపోయే బీఆర్‌ఎస్ పార్టీతో మేం పొత్తు పెట్టుకునే ప్రసక్తేలేదన్నారు.
ప్రజల ఆశీర్వాదం
వేములవాడ, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని అన్ని మండల కేంద్రాలతో పాటు చాలా గ్రామాల్లో పర్యటించి ప్రజల ఆశీర్వాదం తీసుకున్నట్లు చెప్పారు. ఎక్కడకు వెళ్లినా ప్రజాస్పందన బాగా కనిపించిందన్నారు. ఏ గ్రామానికి వెళ్లినా ఢల్లీిలో నరేంద్ర మోదీ ఉండాల్సిందే అని మాట్లాడుతున్నారని చెప్పారు. మోదీ ప్రజల కోసం ఎన్నో పథకాలు ఇవ్వడంతో పాటు ఇటీవలే భవ్యమైన రామమందిరాన్ని నిర్మించారని గుర్తు చేశారు. ఎన్నో సంక్షేమ పథకాల కోసం కేంద్రం నుంచి నిధులు వస్తుంటే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రం ఈ విషయం చెప్పలేదని ఆరోపించారు. నరేంద్ర మోదీ ఇచ్చిన ఉపాధి హామీ నిధులు సహా ఎన్నో పథకాలకు సంబంధించిన నిధులను గత ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు.









