AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప్రజలు మూర్ఖులా?.. ప్రజా తీర్పును జీర్ణించుకోలేని కేసీఆర్‌

వ్యతిరేకంగా ఓటేసిన వాళ్లను అగౌరవపరచడమా?
నియంతృత్వ పోకడకు ఇదే నిదర్శనం
గులాబీ దళపతిపై నిప్పులు చెరిగిన తుమ్మల

అమ్మన్యూస్, హైదరాబాద్‌:
ప్రజాస్వామ్యం గురించి గొప్ప గొప్ప మాటలు మాట్లాడే మాజీ సీఎం కేసీఆర్‌ ప్రజా తీర్పును అగౌరవపరుస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేరన్నారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని, ప్రజల తీర్పును అందరం గౌరవించాలన్నారు. కానీ కేసీఆర్‌ ఇప్పటికీ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారని మంత్రి తుమ్మల విమర్శించారు. నాకు ఓటేసినంత కాలం ప్రజలు తెలివైనవారని, నాకు వ్యతిరేకంగా ఓటేస్తే మాత్రం పజలు మూర్ఖులన్నట్లు కేసీఆర్‌ మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. పాలు ఇచ్చే బర్రెను వదిలేసి దున్నపోతును ఎన్నుకున్నారు అంటూ ప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని గౌరవించక పోగా ప్రజలను చులకన చేసి మాట్లాడడం కేసీఆర్‌ నియంతృత్వ పోకడలకు నిదర్శనమని తుమ్మల నాగేశ్వర రావు ధ్వజమెత్తారు. ఇంతటి రాజకీయ అనుభవమున్న కేసీఆర్‌ ఒక్క ఓటమితోనే ఓటర్ల విజ్ఞతను శంకిస్తున్నారని, ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్లన్న ప్రాథమిక సూత్రాన్ని మరిచి ప్రజలను అవమానించేలా మాట్లాడుతున్నారన్నారు.

పదేళ్లలో రాష్ట్రం నాశనం..
ప్రతిపక్ష నాయకుడి హోదాకు తగని మాటలని ఆయన అన్నారు. కృష్ణా గోదావరి నదులపై తెలంగాణ వాటాను వదులుకున్నది కేసీఆర్‌ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ళు అధికారంలో ఉండి రాష్ట్రానికి న్యాయం చేయకపోగా నాశనం చేసిన చరిత్ర మీదని, కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మాణం పేరుతో జరిగింది అవినీతి కాక ఏమిటీ? అని మండిపడ్డారు. మేడిగడ్డ బ్యారేజ్‌ పిల్లర్లు కుంగితే కేసీఆర్‌ కు కనీసం బాధ్యత, బాధ ఉన్నట్లు కనపడకపోవడం విచారకరమన్నారు. కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయితే ‘ఏమి పీకనీకే పోయారా? అంటూ కేసీఆర్‌ మాట్లాడడం ఎంత బాధ్యతారాహిత్యం..? అని ఆయన ప్రశ్నించారు. నల్లగొండకు పోయే ఓపికుంది కానీ ఇంటిపక్కనున్న అసెంబ్లీకి మాత్రం రారు. ప్రజలెన్నుకున్న సభలో ప్రజా ప్రతినిధుల ప్రశ్నలకు జవాబు చెప్పేధైర్యం లేకనే శాసన సభకు రావడం లేదని ఆయన నిప్పులు చెరిగారు.

ANN TOP 10