వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే 350 సీట్లను గెలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ధీమాను వ్యక్తం చేశారు. ఆదివారం ఎన్నికల ప్రచారాన్ని మధ్యప్రదేశ్ జబువా నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం మోడీ మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇండియా కూటమి మాయమవుతుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఆదివాసీలకు అన్యాయం చేసిందని విమర్శలు చేశారు. తాను లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం జాబువాకు రాలేదని, ప్రజలకు సేవ చేసేందుకు వచ్చానని పేర్కొన్నారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పారు. బీజేపీ దృష్టితో గిరిజనులు ఓటు బ్యాంకు కాదని, వారు దేశానికి గర్వకారణమని ప్రధాని అన్నారు. కాంగ్రెస్ చాలా ఏళ్లు దేశాన్ని పాలించినా కేవలం 100 ఏకలవ్య పాఠశాలన్ని మాత్రమే ప్రారంభించిందని, బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్లలో దీనికి నాలుగు రెట్లు ఎక్కువగా ఏకలవ్య పాఠశాలను ప్రారంభించిందని అన్నారు. దేశంలో ఒక్క ఆదివాసీ బిడ్డ చదువు లేక వెనకబడటం తమకు ఆమోదయోగ్యం కాదని అన్నారు. గిరిజనులు వేల ఏళ్లుగా అటవీ సంపదతో జీవనోపాధి పొందుతోందని చెప్పారు. తమ ప్రభుత్వం ఫారెస్ట్ ప్రాపర్టీ చట్టంతో మార్పులు చేస్తూ అటవీ భూమికి సంబంధించి గిరిజనులకు హక్కుల్ని కల్పించిందని వెల్లడించారు. గిరిజనులు ‘సికెల్ సెల్ ఎనీమియా’ బాధపడిన గత కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ప్రజల కోసం 24 గంటలు పని చేస్తామని ప్రధాని మోడీ అన్నారు.