రుణమాఫీకి బడ్జెట్లో నిధులు కేటాయించలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. శనివారం ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క 2.75 లక్షల కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన బడ్జెట్‌ను సభలో ప్రవేశ పెట్టారు. బడ్జెట్‌పై హరీష్ రావు స్పందించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. రైతుల నోట్లే మట్టి కొట్టేలా బడ్జెట్‌ను రూపొందించారని అన్నారు. రాష్ట్రంలోని ప్రజలకు కొండంత ఆశలు చూపి గోరంత కూడా చేయని బడ్జెట్ ఇది అంటూ వ్యాఖ్యానించారు. రైతుబంధుకు ముగింపు పలికేలా ఆంక్షలు పెట్టారని ఆరోపించారు.
కాంగ్రెస్ హస్తం రైతులకు మొండి చేయిగా మారిందని దుయ్యబట్టారు. బడ్జెట్లో అసలు రైతు రుణమాఫీకి నిధులు కేటాయించలేదని, వడ్లకు ఇస్తానన్న బోనస్ బోగస్‌గా మార్చారని అన్నారు. రైతులను కాంగ్రెస్ పార్టీ దగా చేసిందని, రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఎక్కడ ఇవ్వడం లేదని, 14 నుంచి 15 గంటల కరెంట్ మాత్రమే ఇస్తుందని ఆరోపించారు. రైతులకు కాంగ్రెస్ హ్యాండ్ ఇస్తుందని, రైతాంగానికి అవసరం రూ. 82 వేల కోట్లు అయితే బడ్జెట్లో కేటాయించింది రూ. 16 వేల కోట్లు మాత్రమేనని అన్నారు. నిండు అసెంబ్లీలో కాంగ్రెస్ నేతలు అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. ఆరు గ్యారంటీల అమలు ఎలాంటి స్పష్టత లేదని అన్నారు. రైతులు ఆగ్రహానికి ప్రభుత్వం గురి కాక తప్పదని, ఎన్నికల ప్రచారంలో అబద్ధాలు చెప్పారు.. ఇప్పుడు అసెంబ్లీలో అబద్దాలు చెబుతున్నారని హరీష్ రావు ఆరోపించారు.









