బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు అసెంబ్లీకి రానున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో ఆయన తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెడుతున్నారు. దీంతో ఆసక్తి నెలకొంది. అసెంబ్లీ సమావేశాలు గత రెండు రోజుల నుంచి ప్రారంభం కాగా.. కేసీఆర్ దూరంగా ఉన్నారు. అయితే శనివారం బడ్జెట్ ప్రవేశ పెడుతుండగా హాజరు కానున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ తొలిసారిగా సమావేశాలకు హాజరు కావడంపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. కేసీఆర్ సభకు వస్తుండటంతో బీఆర్ఎస్ నేతలు ఘనంగా స్వాగతం పలకనున్నారు. పదేళ్ల పాటు ఆయన ముఖ్యమంత్రి హోదాలోనే శాసనసభకు వచ్చారు.
ఇక కొత్త ప్రభుత్వం కొలువుదీరాక తొలి శాసనసభ సమావేశాలు జరిగినప్పుడు తుంటికి గాయం కారణంగా ఆస్పత్రిలో చేరిన కేసీఆర్ సభకు హాజరుకాలేదు. ఇటీవలే ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. బీఆర్ఎస్ఎల్పీ నేతగా కూడా బాధ్యతలను స్వీకరించారు. ఆయన బడ్జెట్ సందర్భంగా సభకు వస్తుండటం విశేషం. అదే విధంగా సంక్షేమం – అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా బడ్జెట్ ఉండనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగానికి భారీగా నిధులను రేవంత్ సర్కార్ కేటాయించే అవకాశం ఉందని సమాచారం.









