AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బాలకృష్ణ అక్రమస్తులు వెయ్యి కోట్లు.. విచారణలో సంచలన విషయాలు!

హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. శివబాలకృష్ణ ఏసీబీ కస్టడీ బుధవారం ముగిసింది. దీంతో ఆయన్ని నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టగా.. మరో 14 రోజులు రిమాండ్‌ను పొడగించింది. ఎనిమిది రోజుల విచారణలో శివబాలకృష్ణ చెప్పిన సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర వెల్లడించారు. శివ‌బాల‌కృష్ణ‌కు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. సమీప బంధువులు, ఆయన స్నేహితులు, సహ ఉద్యోగుల ఇళ్లలో మొత్తం 17 ప్రదేశాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించామని తెలిపారు. బాలకృష్ణ అక్రమస్తులు వెయ్యి కోట్లకు పైనే ఉండవచ్చని ఏసీబీ అధికారులు బావిస్తున్నారు.

ఈ విచారణలో భాగంగా రూ. 200 కోట్ల అక్రమ ఆస్తులు ఉన్నట్లు గుర్తించామని అన్నారు. 214 ఎకరాల భూమి, 29 పాట్లు బినామీల పేర్ల మీద ఉన్నాయని, తెలంగాణతో పాటు ఏపీలో కూడా ప్లాట్లు ఉన్నట్లు వెల్లడించారు. హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో 214 ఎకరాలు ఉందని, 19 ఓపెన్ ఫ్లాట్లు, 7 ఫ్లాట్లు, 3 విల్లాలు గుర్తించామని, అలాగే హెచ్‌ఎండీఏలో కీలక ఫైల్స్ స్వాధీనం చేసుకున్నామని స్పష్టం చేశారు. లాకర్లలోనూ భారీగా బంగారం, పత్రాలు గుర్తించినట్లు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర పేర్కొన్నారు. అధికారుల పాత్రపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని, రియల్ ఎస్టేట్ పెట్టుబడులపై ఆరా తీస్తున్నామని, మరి కొంత మంది అధికారుల పాత్రపై కూడా దర్యాప్తు చేస్తున్నామని ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర చెప్పారు. ఇక ఈ కేసులో మరో నలుగురిని అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది.

ANN TOP 10