తన ఓటమి గురించి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఏడు సార్లు గెలిచానని, ఇంకా అవసరమా అని ప్రజలు ఓట్లు వేయలేదని చెప్పారు. అంతేగాక కొంతమంది ఏడుపు కూడా తన ఓటమికి కారణమన్నారు. ఎన్టీ రామారావు లాంటి గొప్పనేతలను కూడా ఓటర్లు ఓడగొట్టారని చెప్పారు.
జనగామ జిల్లా పసరమడ్లలోని ఉషోదయ కన్వెన్షన్ హాలులో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అధ్యక్షతన బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంటరీ ఎన్నికల సన్నాక సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన 420 హామీలను నమ్మి ప్రజలు మోస పోయారని చెప్పుకొచ్చారు.
తప్పుడు కేసులు పెట్టి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, కాంగ్రెస్ కి ఎవరూ భయపడొద్దని ఎర్రబెల్లి అన్నారు. ఏడాది ఓపిక పడితే కాంగ్రెస్ పార్టీ అంతర్గత తగాదాల్లో మునిగిపోతుందని చెప్పారు. కృష్ణా జలాల వివాదం మొదలయిందని అన్నారు.
ఇక గోదావరి జలాల వివాదం కూడ వస్తుందని చెప్పారు. ప్రభుత్వం లేదని కార్యకర్తలు ఆందోళన చెందవద్దని ఆయన అన్నారు. కార్యకర్తలకు తమ అండదండలు ఉంటాయని చెప్పారు. కమిటీలలో కొన్ని లోపాలున్నాయని, వాటిపై సమీక్ష జరిపి, కొత్త కమిటీలు వేస్తామని తెలిపారు.









