AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాజ్యాధికారం సాధించడమంటే జగన్‌ను గద్దె దించడమా?

పవన్‌కు హరిరామ జోగయ్య బహిరంగ లేఖ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు మాజీ ఎంపీ హరిరామ జోగయ్య బహిరంగ లేఖ రాశారు. ప్రస్తుతం టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు అంశమై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో.. హరిరామ జోగయ్య రాసిన లేఖ హాట్ టాపి‌క్‌గా మారింది. రాజ్యాధికారం సాధించడం అంటే వైసీపీని దించి చంద్రబాబును అధికారంలోకి తేవడమా అంటూ ఈ లేఖలో హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నించారు. అలాగే టీడీపీ, జనసేన అధికారంలోకి వస్తే రెండున్నరేళ్లు పవన్ కళ్యాణ్‌ను సీఎం చేస్తామని చంద్రబాబు ప్రకటించాలని డిమాండ్ చేశారు.

పొత్తుల లెక్కలు, సీట్ల సర్దుబాటు గురించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మధ్య ఆదివారం రెండు దఫాలుగా చర్చలు జరిగాయి. ఈ భేటీల్లోనే ఎవరికి ఎన్నిసీట్లు అనే విషయంలో క్లారిటీ వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కాపు ఉద్యమనేత చేగొండి హరిరామజోగయ్య.. పవన్ కళ్యాణ్‌కు బహిరంగ లేఖ రాశారు. ఇప్పటికే పలు అంశాలపై అనేకసార్లు పవన్ కళ్యాణ్‌కు లేఖరాసిన హరిరామ జోగయ్య.. ఈసారి రాసిన లేఖ మాత్రం కాస్త ఘాటుగానే ఉంది.

టీడీపీ, జనసేన మధ్య సీట్ల పంపకం జరిగిందనీ, జనసేనకు ఇచ్చే స్థానాలు ఇవేనంటూ సోషల్ మీడియాలో ఆదివారం నుంచి ప్రచారం జరుగుతోంది. జనసేనకు 30 సీట్లు, 35 సీట్లు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హరిరామ జోగయ్య లేఖ రాశారు. రాజ్యాధికారం ధ్యేయంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీని గద్దెదింపాలంటే టీడీపీ, జనసేన కలవాల్సిన తప్పనిసరి పరిస్థితి ఉందని హరిరామ జోగయ్య లేఖలో పేర్కొన్నారు. కానీ కాపులకు రాజ్యాధికారం దక్కాలంటే కేవలం వైసీపీని గద్దెదించి, టీడీపీని అధికారంలోకి తేవటం కాదని హరిరామ జోగయ్య అభిప్రాయపడ్డారు. బడుగు, బలహీనవర్గాలకు, కాపులకు రాజ్యాధికారం అంటే వైసీపీని గద్దెదించి, చంద్రబాబును అధికారంలోకి తేవటమా అంటూ ప్రశ్నించారు.

టీడీపీ, జనసేనకు సీట్లు కేటాయించడం కాదని.. జనసేనే టీడీపీకి సీట్లు ఇచ్చేలా పరిస్థితి ఉండాలన్నారు. చంద్రబాబును అధికారంలోకి తెచ్చేందుకు కాపులు పవన్ కళ్యాణ్ వెంట నడవడం లేదన్న హరిరామ జోగయ్య.. జనాభా దామాషా ప్రకారం సీట్ల కేటాయింపు జరగకపోతే రాష్ట్ర ప్రయోజనాలు ఎలా కాపాడతారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో 40 నుంచి 60 సీట్లలో జనసేన పోటీ చేయాలని సూచించారు. అలాగే టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్‌కు రెండున్నర సంవత్సరాలు సీఎం పదవి ఇవ్వాలని లేఖలో హరిరామ జోగయ్య డిమాండ్ చేశారు.

ANN TOP 10