బీజేపీ అగ్రనేత, ఉక్కుమనిషి లాల్ కృష్ణ అద్వానీకి కేంద్ర ప్రభుత్వం భారత రత్న అవార్డును ప్రకటించింది. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ఎల్‌కే అద్వానీకి శుభాకాంక్షలు తెలిపారు. దేశ అభివృద్ధిలో అద్వానీ పాత్ర కీలకం అన్నారు.
90వ దశకంలో బీజేపీని ముందుండి నడిపించిన అద్వానీ.. అప్పట్లో అయోధ్య రామాలయం కోసం రథ యాత్ర కూడా చేశారు. ఇప్పుడు ఆయనకు భారతరత్న ప్రకటించడంతో బీజేపీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
‘ఎల్‌కే అద్వానీ జీకి భారతరత్న ఇస్తున్నారనే వార్తను పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను కూడా ఆయనతో మాట్లాడి ఈ గౌరవం పొందినందుకు అభినందించాను. మన కాలంలో అత్యంత గౌరవనీయులైన రాజనీతిజ్ఞులలో ఒకరు, భారతదేశ అభివృద్ధికి ఆయన చేసిన కృషి స్మారకమైనది. అట్టడుగు స్థాయిలో పని చేయడం నుంచి మన ఉప ప్రధానమంత్రిగా దేశానికి సేవ చేయడం వరకు ఆయనది గొప్ప జీవితం. ఆయన మన హోం మంత్రిగా కూడా గుర్తింపు పొందారు. ఆయన పార్లమెంటరీ సలహాలు ఎప్పుడూ ఆదర్శప్రాయమైనవి’ అని ప్రధానమంత్రి ట్వీట్ చేశారు.
దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన శుభాకాంక్షలు
ఎల్‌కే అద్వానీకి భారతరత్న ఇవ్వాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. ఒకప్పుడు ఆయన దేశ ప్రధాని అయ్యేవారే. ఆ సమయంలో వాజ్‌పేయ్ కారణంగా.. అద్వానీ.. ఉప ప్రధానిగా మిగిలిపోయారు. ఆ తర్వాత మోదీ శకం మొదలైంది. దాంతో.. బీజేపీ లోని సీనియర్లు కాస్త వెనక్కి తగ్గారు. ఆ తర్వాత మోదీ హయాంలో బీజేపీ మరింత శక్తిమంతమైన పార్టీగా మారింది. మోదీ, అమిత్ షా ద్వయంలో బీజేపీ చాలా బలపడింది. దాంతో.. సహజంగానే అద్వానీ తరహా సీనియర్లకు పార్టీలో ప్రాధాన్యం తగ్గింది. అయినా ప్రధాని మోదీ.. తరచూ సీనియర్లను కలుస్తూ.. వారి సూచనలూ, సలహాలూ తీసుకుంటూ వచ్చారు. ఇప్పుడు అద్వానీకి భారతరత్నను ప్రకటించడం ద్వారా.. బీజేపీ ఆయనకు తగిన గుర్తింపు ఇచ్చినట్లయిందని సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.









