10న కాంగ్రెస్‌లో చేరనున్న మాజీమంత్రి
ఆరు నెలలుగా మానసిక వేధన అంటూ ఆవేదన
లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్.. కీలక నేత పార్టీకి గుడ్‌బై చెప్పారు. కారు దిగనున్నట్లు తెలంగాణ తొలి డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య ప్రకటించారు. పార్టీలో పాధాన్యం దక్కకపోటవంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈనెల 10న సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరనున్నట్లు సమాచారం.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై చతికలపడిన బీఆర్ఎస్ పార్టీకి పుండు మీద కారం తగిలినట్లు కీలక నేత గుడ్‌బై చెప్పారు. తెలంగాణ తొలి డిప్యూటీ సీఎం, మాజీ మంత్రి తాటికొండ రాజయ్య పార్టీని వీడనున్నట్లు ప్రకటించారు. రాజీనామా లేఖను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు పంపించారు. పార్టీలో సరైన గౌరవం దక్కకపోవటంతోనే తాను పార్టీ వీడుతున్నట్లు రాజయ్య వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్ నిరాకరించినా.. కష్టపడి పనిచేశానని అయినా అధిష్టానం తనను చిన్నచూపు చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీకి వీర వీధేయుడిగా ఉంటే..
ఆరు నెలలుగా మానసిక వేధన..అనుభవిస్తున్నానని రాజయ్య వెల్లడించారు. అనేక సందర్భాల్లో పార్టీకి వీర వీధేయుడిగా ఉంటే.. అటు వైపు నుంచి రెస్పాన్స్ రావట్లేదని ఆవేధన వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎంగా ఉన్న తనను తీసేసినా.. విధేయుడిగానే ఉన్నానని, ఎన్నికల్లో సీటు ఇవ్వకున్నా… పార్టీ కోసం పని చేశానని తెలిపారు. వ్యక్తిగతంగా కూడా పార్టీలో గుర్తింపు లేదన్నారు. నాలుగు సార్లు గెలిచినా.. ప్రాధాన్యత లేదన్నారు.
పార్టీ విధానాలు నచ్చకే..
బీఆర్ఎస్ పార్టీకి క్షేత్రస్థాయిలో ఆదరణలో లేదని, స్థానిక నాయకత్వం లోపం ఉందని, రాష్ట్రం నాయకత్వం కూడా బాగోలేదని రాజయ్య అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని, అలాంటి ప్రభుత్వాన్ని కూల్చేస్తామనడం అవివేకానికి నిదర్శనమన్నారు. ఆరు నెలలల్లో కేసీఆర్ ఎలా ముఖ్యమంత్రి అవుతారని ప్రశ్నించారు. పార్టీ విధానాలు నచ్చకే గుడ్‌బె చెబుతున్నా.. అని రాజయ్య అన్నారు. ఇదిలా ఉంటే ఆయన వరంగల్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. ఆయన రాజీనామాతో వరంగల్‌లో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి.









