బీఆర్ ఎస్ అడ్రస్ ఇక గల్లంతే.. మంత్రి సీతక్క
కంది శ్రీనివాస రెడ్డికి మంత్రి సీతక్క ప్రశంసలు
ఆదిలాబాద్ ప్రతినిధి : ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జి మంత్రి సీతక్క వ్యూహాలకు తోడు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి సమయోచిత కార్యాచరణకు జిల్లాలో బీఆర్ ఎస్ మనుగడ ప్రశ్నార్థకం కానుంది. కాంగ్రెస్ లోకి రోజు రోజుకు ఆ పార్టీ నుండి వలసలు సునామిలా ముంచెత్తడంతో కారు పార్టీ దిక్కుతోచని స్థితిలో పడింది. ఇప్పటికే జిల్లాలో దాదాపు సగం బీఆర్ ఎస్ క్యాడర్ ఖా ళీ అయినట్టు తెలుస్తోంది.ఇక ఆదిలాబాద్ నియోజకవర్గంలో అయితే కంది శ్రీనన్న దెబ్బకు ఆపార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకు పోయే స్థితి ఏర్పడింది. తాజాగా బీఆర్ఎస్ నుండి పెద్ద సంఖ్యలో చేరిన సర్పంచులు ,ఎంపీటీసీలు , మాజీలతో ఆ పార్టీ జిల్లా నాయకత్వానికి నిద్రకరువైంది. అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ఆర్ ఎస్ గార్డెన్ లో నిర్వహించిన సమీక్షా సమావేశానికి పంచాయతీ రాజ్ , గ్రామీణాభివృద్ధి , స్త్రీశిశుసంక్షేమ శాఖ మంత్రి, ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జీ మంత్రి సీతక్క ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
తమ్ముడు శ్రీను భేష్
ఎన్నికలేవైనా గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆమె శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ఓడినా గుండె బలంతో నిత్యం ప్రజల్లోనే ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ.. పార్టీ బలోపేతానికి పాటు పడుతున్న అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డిని ప్రశంసించారు.

తమది ప్రజా పాలన.. అనవసర విమర్శలు తగవు
జన సంక్షేమమే లక్ష్యంగా ప్రజా పాలన కొనసాగిస్తున్న తమ ప్రభుత్వం పై బీఆర్ ఎస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను ఆమె తిప్పికొట్టారు. పదేళ్లు అధికారం అనుభవించిన ఆ నాయకులకు ప్రతిపక్షంలో కూర్చునే సరికి మతిభ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలోకి బలవంతపు చేరికలు లేవన్నారు. ప్రతి పక్షాలు అలాంటి విమర్శలు మానుకోవాలన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల జిల్లా అన్నివిధాలుగా వెనుకబడిందన్నారు. అభివృద్ధే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఎక్కడైతే కష్టాలుంటాయో ఎక్కడైతే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో అక్కడే పని చేయడం తన కిష్టమన్నారు. అందుకే ఇంఛార్జి మంత్రిగా ఆదిలాబాద్ జిల్లాను ఎంచుకున్నానన్నారు. జిల్లాలో అనేక గ్రామాలు అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు. అడవులను నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నఆదివాసీల బ్రతుకులలో మార్పు రావాలన్నారు. మనం ప్రజలకు మంచి చేస్తే ప్రజలు దేవుళ్లలా పూజిస్తారన్నారు. నాయకులు ప్రజల కోసం పని చేయాలని సూచించారు. సరైన పోష్టికాహారం లేక ఇక్కడి పిల్లలు రక్త హీనతతో బాధపడుతుండటానికి కారణం పేదరికమే అన్నారు. అటు కేంద్రం ఇటు రాష్ట్రం ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు. అందుకే జిల్లా ఇలా వెనుక బాటుకు గురైందన్నారు.
అధికారంలో ఉన్నామని ఆకాశంలో ఉండకుండా కాళ్లు భూమి పై ఉండాలన్నారు. ఉచిత బస్సుప్రయాణంతో మహిళలందరు సంతోషంగా ఉంటే బీఆర్ ఎస్ నాయకులకు మింగుడుపడడం లేదన్నారు. అందుకే ఆటో డ్రైవర్ల ను ముందుకు తెచ్చి అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్నారు.
బీఆర్ఎస్ కు దిమ్మతిరిగింది
అనంతరం అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రజా పాలన చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక పోతున్నాయని అన్నారు. తమ పార్టీపై నమ్మకంతో బీఆర్ ఎస్ పార్టీ నుండి రోజురోజుకు పెద్దసంఖ్యలో వచ్చి చేరుతున్నారన్నారు. వారందరికీ పార్టీ తరపున ఘన స్వాగతం పలుకుతున్నానన్నారు. తమ పార్టీ కార్యకర్తల జోలికొస్తే గొయ్యి తీసి పాతిపెడతామన్నారు. కష్టపడి పని చేసే తత్వం సీతక్క దని విరామం ఎరుగక ప్రజలకోసం కష్టపడుతున్న ఆమె చిత్త శుద్ధికి శిరసు వంచి నమస్కరిస్తున్నానన్నారు. జిల్లాలో గత ఫలితాలు మనకు అనుకూలంగా రాలేక పోయినప్పటికి పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఘన విజయం సాధించి తీరాలన్నారు. తను ఓడిపోయినప్పటికీ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ పెరగడం ,పార్టీ పటిష్ట స్థితికి చేరుకోవడం సంతోషంగా ఉందన్నారు. స్వచ్చందంగా తమ పార్టీలోకొస్తున్న బీఆర్ ఎస్ క్యాడర్ ను చూసి మాజీ ఎమ్మెల్యే జోగురామన్న తట్టుకలేక ప్రెస్ మీట్లు పెట్టి బలవంతపు చేరికలనడం హాస్యస్పదమన్నారు. పార్లమెంట్ అభ్యర్థి విజయానికి అత్యధిక మెజార్టీ మన నియోజకవర్గం నుండే రావాలన్నారు. ఎవరు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో అతడే రేవంతన్న అన్నారు. ఆయన దెబ్బకు ఇక బీఆర్ఎస్ పదేళ్లయినా లేవదన్నారు.
పార్టీలో చేరిన వారు
అనంతరం పార్టీలో చేరేందుకు వచ్చిన వారికి సీతక్క కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముందుగా జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మతో పాటు బేల మాజీ సడ్పీటీసి రాందాస్ నాక్లే ఆధ్వర్యంలో జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు పోహార్ సర్పంచ్ ఆడె శంకర్ సదల్పూర్ ఎంపీటీసీ,కొడప అరుణ్, చప్రాల ఎంపీటీసీ మడావి సకారామ్,చప్రాల సర్పంచ్ మెస్రం దౌలత్ రావు , చాంద్ పల్లి సర్పంచ్ కోరెంగ జంగ్ శావ్ ,బోరింగ్ గూడ చాంద్ పల్లి సర్పంచ్ దడంజే కేశవ్, గణేష్ పూర్ సర్పంచ్ మడావి లక్ష్మణ్ ,రాయ్ పూర్ గణేష్ పూర్ ఉప సర్పంచ్ మాడావి కటోడా , సొంకాష్ సర్పంచ్ మెస్రం జనార్దన్ ,సొంకాష్ మాజీ సర్పంచ్ గేడం బాపూరావు ,వరూర్ సర్పంచ్ దడంజే తుకారాం ,సదల్పూర్ మాజీ సర్పంచ్,సిడాం కుశాల్ రావు ,ఏకోరి సర్పంచ్ నైతం సీతారామ్ ,ఏకోరి యూత్ మెంబెర్,అంకత్ రెడ్డి ,కొబ్బాయ్ పర్ధాన్ సమాజ్ వైస్ ప్రెసిడెంట్ నైతం పురుషోత్తం ,కరోని.కే వి.టి.డి.ఏ ప్రెసిడెంట్ మెస్రం రాజు ,యూత్ మెంబెర్,నైతం ప్రమోద్, బాధి యూత్ ప్రెసిడెంట్ గేడం శ్యామ్ రావు తదితరులకు కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.









