AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కాంగ్రెస్ గ్యారంటీల అమలు.. మంత్రి జూపల్లి కీలక అప్డేట్

గ్యారంటీల అమలుపై మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక అప్డేట్ ఇచ్చారు. తాము ఆరు గ్యారంటీల్లో రెండు గ్యారంటీలను అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే అమలు చేశామని.. మిగతా నాలుగు గ్యారంటీల అమలు కోసమే ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు స్వీకరించామని తెలిపారు. దరఖాస్తుల పరిశీలన పూర్తికాగానే దశలవారీగా మిగిలిన వాటిని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. దరఖాస్తుల డిజిలైజేషన్ ప్రక్రియ జరుగుతోంది.. వీలైనంత త్వరగా లబ్ధదారులను ఎంపిక చేస్తామన్నారు. గ్రామాల్లో గ్రామ సభల ద్వారా అధికారుల సమక్షంలో అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు.

ఇక సీఎం రేవంత్ దావోస్ పర్యటనపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో భాగంగానే రేవంత్ రెడ్డి అదానీని కలిశారన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ అనేక హామీలు ఇచ్చిందని.. అందులో ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయలేకపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించిందనందుకే ప్రజలు బీఆర్ఎస్‌ను ఓడించారన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రావడాన్ని జీర్ణించుకోలేక రెండు నెలలకే తమ ప్రభుత్వంపై విమర్శలు ప్రారంభించారని మండిపడ్డారు.

2014లో బంగారు పళ్లాన్ని ప్రజలు కేసీఆర్ చేతిలో పెడితే.. అప్పుల కుప్పగా మార్చాడని జూపల్లి విమర్శించారు. రహస్యంగా జారీ చేసిన ఎన్నో జీవోలను బీఆర్ఎస్ బహిర్గతం చేయలేదన్నారు. తొమ్మిదేళ్లలో రూ.7 లక్షల కోట్ల అప్పు చేసిందని.. ఇవాళ రూ.40 వేల కోట్లు వడ్డీకే పోతోందన్నారు. బీజేపీ తీసుకొచ్చిన ప్రతి బిల్లుకు పార్లమెంట్‌లో బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని.. దీన్ని బట్టే ఆ రెండు పార్టీల మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుస్తుందని జూపల్లి దుయ్యబట్టారు.

ANN TOP 10