రాజీనామా వార్తలు అవాస్తవం
–స్పందించిన గవర్నర్ తమిళిసై
తాను ఇక్కడే ఉంటానని.. ప్రజలతో ఉండడానికే ఇష్టపడతానని, రాజీనామా వార్తలు అవాస్తవమని గవర్నర్ తమిళి సై అన్నారు. శనివారం ఆమె బోయిన్‌పల్లిలోని అయోధ్య రామాలయ ద్వారాలు తలుపులు, తయారు చేసిన అనురాధ టింబర్ డిపోను సందర్శించారు. ఈ సందర్భంగా తమిళి సై మాట్లాడుతూ.. రాజీనామా చేసి తుతుకుడి నుంచి పోటీ చేస్తున్నానని వస్తున్న వార్తలు ప్రచారాలు మాత్రమేనన్నారు. తాను ఇక్కడే ఉంటానని.. ప్రజలతో ఉండడానికి ఇష్టపడతానన్నారు. ప్రజల కోసం పని చేయడానికి ఇష్టపడతానన్నారు. తాను ఢిల్లీ కి రిక్వెస్ట్ చేయలేదని తమిళి సై తెలిపారు.
‘‘నేను తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్‌గానే ఉంటున్నాను. ప్రధాని మోదీ, రాముడి దయతో విధులు నిర్వహిస్తున్నా. ఢిల్లీ వెళ్లలేదు, ఎవరినీ రిక్వెస్ట్ కూడా చేయలేదు. తమిళనాడు తూత్తుకుడి వరదల వల్ల ప్రభావం అయ్యినందున వెళ్లి చూసి వచ్చాను. మీరు అనుకొంటున్నట్లు నేనేమి ఎన్నికల్లో పోటీ చేయట్లేదు. చాలా ఆనందంగా ఉంది.. ఇక్కడికి రావడం.. రాముడు ప్రతిమ చూసి చాలా సంతోషం కలిగింది. ఇది అంత ఈజీ పని కాదు.. చాలా కష్టమైన పని… వీరు ఇంత చక్కగా తీర్చి దిద్దటం చాలా బాగుంది.
రామ మందిర్‌లో అనురాధ టింబర్స్ కూడా ఒక గొప్ప భూమిక పోషించడం ఎంతో గర్వకారణం. నేను ఒక గవర్నర్ గా ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. అవసరమైతే వాళ్ళనే పిలిపించుకోవచ్చు… కానీ నేనే ఆ అద్భుతాలను చూడాలని ఇక్కడికి వచ్చాను. మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలుసుకుని వచ్చాను. నాకు నా అధిష్టానం ఏ బాధ్యత అప్పగిస్తే అది ఫాలో అవుతాను. నేను ఎటువంటి విజ్ఞప్తి చెయ్యలేదు. ఎంపీగా పోటీ చేస్తానని తుత్తుకుడిలో వేరే ఒక ప్రోగ్రాంలో పాల్గొనడానికి వెళ్లాను. మళ్ళీ రాజకీయాలకు అంటే… నేను ఎప్పుడూ ప్రజలతోనే ఉంటాను. ఉండాలి అనుకుంటాను’’ అని తమిళి సై పేర్కొన్నారు.









