కరీంనగర్: ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ వంద రోజుల్లో అమలు చేయాలని బీజేపీ ఎంపీ, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ డిమాండ్ చేశారు. దరఖాస్తుల స్వీకరణను స్వాగతిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ మాదిరిగా నామమాత్రంగా దరఖాస్తులు తీసుకోవద్దన్నారు. దరఖాస్తుల స్వీకరణ రాజకీయాలకు అతీతంగా చేయాలన్నారు. అన్నిటి కంటే ముందు రేషన్ కార్డులు ఇవ్వాలని బండి సంజయ్ అన్నారు. బీజేపీ కార్యకర్తలు కూడా దరఖాస్తుల్లో పాల్గొనాలన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందన్నారు. బీఆర్ఎస్ అసలు పోటీలోనే లేదన్నారు. కేటీఆర్ అహంకారం ఇంకా తగ్గలేదన్నారు. కేటీఆర్ అహంకారం బీఆర్ఎస్ కొంప ముంచిందన్నారు. 50 లక్షల కోట్ల సంపద సృష్టిస్తే.. ఒకటో తేదీన జీతాలు ఎందుకు ఇవ్వలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. భూములు ఎందుకు అమ్మాల్సి వచ్చిందని నిలదీశారు. దళిత బంధు అందరికీ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ప్రజలు గుణపాఠం చెప్పినా బుద్ధి రాలేదా కేటీఆర్ అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.









