AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పీవీ కీర్తి పెంచేలా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుంది: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహా రావు కీర్తిని పెంచేలా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పీవీ నరసింహా రావు 19వ వర్ధంతి సంద‌ర్భంగా నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ వ‌ద్ద రేవంత్ రెడ్డి నివాళుల‌ర్పించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి పీవీ అని అన్నారు. దేశ ఆర్ధిక వ్యవస్థ ప్రశ్నార్ధకంగా మారినప్పుడు సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారన్నారు.

“బంగారాన్ని కుదవ పెట్టి అప్పులు తేవడంపై ఆయన ఒకే మాట చెప్పారు. తెలివైన వాడు సగం ఆస్తిని కుదవపెట్టి అయినా సరే మిగతా ఆస్తిని కాపాడుకుంటారని ఆయన చెప్పారు” అని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. పరిపాలనలో సమూల మార్పులు తెచ్చి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి పీవీ నరసింహా రావు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. భూమిని పేదవాడికి అందుబాటులోకి తీసుకొచ్చిన వ్యక్తి పీవీ. పేదలకు భూములు పంచడానికి పీవీ బలమైన పునాదులు వేశారని అన్నారు.

పీవీ మన మధ్య లేకపోయినా వారి సంస్కరణలు సదా ఆచరణీయం అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పీవీ ఘాట్, జైపాల్ రెడ్డి ఘాట్ లను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వీరిద్దరూ తెలంగాణకు లంకె బిందెల్లాంటి వారని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10