తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనపై తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తోన్నారు. సమర్థులైన అధికారులకు ఇప్పటికే వారి సామర్థ్యానికి తగిన చోట పోస్టింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో పలువురు ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగబోతోన్న పరిస్థితుల్లో రాష్ట్రంలో గల 17 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు రేవంత్ రెడ్డి. దీనికోసం తనకంటూ ఓ ప్రత్యేక టీమ్‌ను రూపొందించుకుంటోన్నారాయన. అటు పరిపాలన, ఇటు శాంతిభద్రతలను కాపాడటానికి ప్రాధాన్యతను ఇస్తోన్నారు.
ఈ క్రమంలో ఇప్పటికే పలు బదిలీలు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లకు కొత్త అధిపతులను నియమించారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని నియమించారు. రాచకొండ పోలీస్ కమిషనర్‌గా జీ సుధీర్ బాబు, సైబరాబాద్ కమిషనర్‌గా అవినాష్ మహంతి అపాయింట్ అయ్యారు. రేవంత్ రెడ్డి కార్యదర్శిగా సీనియర్ ఐపీఎస్ అధికారి షానవాజ్ ఖాసింను అపాయింట్ అయ్యారు. తాజాగా మరో ఉన్నతాధికారి.. రేవంత్ రెడ్డి టీమ్‌లో జాయిన్ అయ్యారు. ఆయన పేరు బీ అజిత్ రెడ్డి. ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీసెస్ (ఐడీఈఎస్)కు చెందిన అధికారి. ఇదివరకు సెంట్రల్ సర్వీసుల్లో ఉన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారిగా పని చేశారు. రేవంత్ రెడ్డి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా అజిత్ రెడ్డి అపాయింట్ అయ్యారు. అయిదు సంవత్సరాల పాటు డెప్యుటేషన్ కింద ఆయన రాష్ట్ర సర్వీసులకు బదిలీ అయ్యారు. ఆయనను రేవంత్ రెడ్డి ఓఎస్డీగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.