నాలుగురోజుల పాటు నిర్వహణ
తరలిరానున్న కోట్లాది ప్రజలు
ఏర్పాట్లకు రూ.75కోట్లు్ల విడుదల చేసిన రేవంత్ సర్కార్
దేశంలోనే ప్రసిద్ధిచెందిన మేడారం జాతర ఫిబ్రవరి 21 నుంచి జరగనుంది. తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగే ఆదివాసీ గిరిజన జాతర నాలుగురోజులపాటు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. కేవలం తెలంగాణ నుంచి మాత్రమే కాకుండా ఈ జాతరను చూసేందుకు ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు. ఈ జాతర ప్రతి రెండేళ్లకొకసారి ఎంతో వైభవంగా జరుగుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు ఈ జాతర జరగనుంది. ఈ జాతరకు కోట్లాది మందికి పైగా భక్తులు తరలివచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ జాతర కోసం రూ.75 కోట్లతో 21 శాఖల అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. అయితే, ఎన్నికల నేపథ్యంలో అవి అమోదం కాలేదని తెలుస్తోంది. అయితే, తాజాగా రాష్ట్రప్రభుత్వం ఈ జాతర కోసం రూ.75 కోట్ల విడుదలకు ఆమోదం తెలిపింది. దీంతో ఈ జాతర పనులు షూరు అయ్యాయి.
ఫిబ్రవరి 14న మాఘశుద్ధ పంచమి నుంచి క్రతువు ప్రారంభం..
ఈ జాతరలో భాగంగా ఫిబ్రవరి 14న మాఘశుద్ధ పంచమి రోజున మండె మెలిగె, గుడి శుద్ధీకరణ క్రతువుతో జాతరను ప్రారంభం చేయనున్నారు. నాలుగురోజులపాటు జరిగే ఈ జాతరతో చుటుపక్కల ప్రాంతాలన్నీ ఎంతో కోలహాలాంగా మారతాయి. ముందుగా భక్తులంతా జంపన్నవాగులో స్నానాలాచరించి దేవతామూర్తులను దర్శించుకుని వారికి బంగారుకానుకలు సమర్పిస్తారు. మేడారం జాతరలో మొదటిరోజు కన్నెపల్లి ప్రాంతం నుంచి సారలమ్మను గద్దె పైకి తీసుకువస్తారు. ఆ తర్వాత రోజు చిలకలగుట్ట దగ్గర ఉన్న సమ్మక్కను తీసుకువచ్చి గద్దెపై ప్రతిష్టిస్తారు. మూడో రోజు భక్తులు గిరిజన తల్లులు సమ్మక్క సారలమ్మను కొలుస్తారు. నాలుగు రోజు అమ్మవార్లు తిరిగి వన ప్రవేశం చేస్తారు. మేడారం జాతరకు కనీసం 6 నెలల ముందునుంచే ఏర్పాట్లు చేయాల్సి ఉన్నా, ఎన్నికల నేపథ్యంగా ఆలస్యమైంది. దీంతో ఇక్కడ చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి. అందులో ముఖ్యంగా మంచినీటి సదుపాయం, రహదారులు, 24 గంటల విద్యుత్ సరఫరాకు ఎటువంటి ఆటంకం లేకుండా చేయాలి. ఈ రెండు నెలల సమయంలోనే ఈ పనులన్నీంటిని పూర్తిచేయాల్సి ఉంటుంది.









