– పాలమ్మడం.. పూలమ్మడం దేవుడెరుగు
– ఆయన భూ దందాలే నిజమెరుగు
– భూ కబ్జాలపై తాజాగా కేసు నమోదు
– రేవంత్ సర్కార్ ప్రత్యేక నజర్
పాలు అమ్మిన.. పూలు అమ్మిన.. బోర్ వెల్ నడిపించిన.. కాలేజీలు పెట్టిన.. స్కూళ్లు పెట్టిన.. కష్టపడ్డా.. కాయ కష్టం చేసిన.. చమటోడ్చిన.. అంటూ చెప్పే మాజీ మంత్రి మల్లారెడ్డిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పాలమ్మి.. పూలమ్మి.. ఇంత స్థాయికి వచ్చినట్లు ఆయన చెప్పుకున్నా.. పలు భూదందాలే ఆయన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చాయన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తుండటం తెలిసిందే.
ఇటీవల గిరిజనుల భూములను కబ్జా చేశారంటూ వచ్చిన ఫిర్యాదులపై మల్లారెడ్డిపై చీటింగ్ కేసు నమోదైన విషయం విదితమే. శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో మల్లారెడ్డిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేశారు. 47 ఎకరాలు కబ్జా చేశారని ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో రాత్రికి రాత్రి రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తహసీల్దార్‌తో పాటు మల్లారెడ్డిపై ఫిర్యాదు రావడంతో నాలుగు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. మల్లారెడ్డితో పాటు అతని అనుచరులు తొమ్మిది మందిపై 420 చీటింగ్ కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ నమోదు అయ్యింది. మల్లారెడ్డి మంత్రిగా ఉన్న హయాంలోనూ ఆయనపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి.
తాజాగా చోటు చేసుకున్న పరిణామంతో మల్లారెడ్డి అక్రమాలపై రేవంత్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మల్లారెడ్డిపై వచ్చే ఆరోపణలపై అధికారులు సీరియస్ గా నజర్ వేయాలన్న సంకేతాలు అందినట్లుగా చెబుతున్నారు. నిజానికి.. మల్లారెడ్డిపై మొదట్నించి భూకబ్జా ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి. అయితే.. ఆయన అధికారపక్షంలో ఉండటంతో ఆయనపై వచ్చే ఆరోపణలు ముందుకు వెళ్లలేదు. అయితే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి.. రేవంత్ ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో కష్టాలు తప్పవంటున్నారు. జైలుకు పంపినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న మాట వినిపిస్తోంది.
తహసీల్దార్ వాణిరెడ్డిపై కేసు నమోదు చేయాలి..
అధికార పార్టీ అండతో మంత్రిగా మల్లారెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని బాధితులు ఆరోపించారు.
మాజీ మంత్రి మల్లారెడ్డి ఆదేశాలతో రాత్రి 11 గంటలకు శామీర్‌పేట్ తహసీల్దార్ కార్యాలయంలో తాసీల్దార్, సబ్ రిజిస్టర్ వాణి రెడ్డి అక్రమంగా 47.18 ఎకరాల భూమిని మాజీ మంత్రి అనుచరులపై రిజిస్టర్ చేశారని వారు ఆరోపించారు. తహసీల్దార్ వాణి రెడ్డి రిజిస్ట్రేషన్ చేసే సమయంలో మాకు ఎలాంటి సమాచారం చెప్పకుండా మల్లారెడ్డి డబ్బు సంచులకు కక్కుర్తి పడి మా భూమిని ధారా దత్తం చేశారని దుమ్మెత్తి పోశారు. మా భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన తహసీల్దార్ వాణి రెడ్డి పై కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బాధితులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ముఖ్యమంత్రికి ఫిర్యాదు
మా భూములను అప్పటి మంత్రి మల్లారెడ్డి కబ్జా చేశారని బాధిత గిరిజనులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. మాకు తెలియకుండానే 250 కోట్ల విలువ చేసే 47 ఎకరాల 18 గుంటల భూమిని అక్రమంగా అర్థరాత్రి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆరోపించారు. ఈ విషయమై సమగ్ర విచారణ చేపట్టి మాకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మీడియా ముఖంగా విన్నవించారు.









