AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ ఏకగ్రీవ ఎన్నిక

– తెలంగాణకు తొలి దళిత స్పీకర్‌
తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభ స్పీకర్‌ గా వికారాబాద్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్‌ గా ఆయన కాసేపటి క్రితం బాధ్యతలు స్వీకరించారు. సభలో కొత్త స్పీకర్‌ ను సీఎంతో సహా పలువురు అభినందించారు. సీఎం రేవంత్‌ రెడ్డితో కలిసి స్పీకర్‌ పదవికి ఆయన బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున మాజీ మంత్రి కేటీఆర్‌.. గడ్డం ప్రసాద్‌ కుమార్‌కు మద్దతుగా సంతకం చేశారు. దీంతో స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవమైంది. గురువారం ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఓవైసీ అధికారికంగా ప్రకటించారు.

పలువురి అభినందనలు..
సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, కేటీఆర్, వేముల ప్రశాంత్‌ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆయన్నుస్పీకర్‌ కుర్చీలో కూర్చొబెట్టి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సభలో మాట్లాడిన సీఎం రేవంత్‌.. స్థానిక సంస్థల నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన గడ్డం ప్రసాద్‌.. నేడు సభా అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. గడ్డం ప్రసాద్‌ ఏకగ్రీవ ఎన్నిక స్పీకర్‌ పదవికి వన్నె తెచ్చిందని చెప్పారు.

గడ్డం ప్రసాద్‌ రాజకీయ ప్రస్థానం..
మరోవైపు, మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఓడించిన ఘనత గడ్డం ప్రసాద్‌ ది కావడం గమనార్హం. 2008లో ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమయింది. తెలంగాణ ఉద్యమం సమయంలో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇప్పటి వరకు ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2008 ఉపఎన్నిక, 2009లో ఆయన వరుసగా రెండు సార్లు వికారాబాద్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009 ఎన్నికల్లో వికారాబాద్‌ నుంచి కేసీఆర్‌ పోటీ చేశారు. ఆ ఎన్నికలో కేసీఆర్‌ పై గడ్డం ప్రసాద్‌ దాదాపు 5 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత 2014, 2018లో వికారాబాద్‌ నుంచే ఓటమిపాలయ్యారు. వరుసగా రెండు సార్లు ఓటమిపాలయినప్పటికీ ఆయన వికారాబాద్‌ నియోజకవర్గాన్ని వీడలేదు. ఇప్పుడు మళ్లీ వికారాబాద్‌ నుంచే గెలుపొంది, అత్యున్నతమైన అసెంబ్లీ స్పీకర్‌ పదవిని చేపట్టారు. గడ్డం ప్రసాద్‌ కు భార్య శైలజ, ఇద్దరు సంతానం ఉన్నారు.

ANN TOP 10