వరంగల్ సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది.. అతివేగంగా వెళ్తున్న బస్సు అదుపతప్పి రోడ్డు పక్కన ఉన్న పంట పొలాల్లోకి దూసుకెళ్లింది.. ఈ ప్రమాదం లో గాయాలపాలైన ప్రయాణికులను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.. డ్రైవర్ అజాగ్రత్తే ఈ ప్రమాదానికి కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రమాదం హనుమకొండ జిల్లా దామెర మండలం ఒగ్లాపూర్ వద్ద జరిగింది. వరంగల్- 2 డిపో కు చెందిన బస్సు హనుమకొండ నుండి ఏటూరునాగారం వెళ్తుండగా ప్రమాదానికి గురైంది.
అతి వేగంగా వెళ్తున్న బస్సు ఒగ్లపూర్ వద్ద ముందున్న వాహనాన్ని ఓవర్ టెక్ చేసేందుకు ప్రయత్నించింది.. ఈ క్రమంలోనే డ్రైవర్ బస్సును కంట్రోల్ చేయలేక పోయాడు.. బస్సు అతివేగంగా అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న పత్తి పంటలోకి దూసుకెళ్లింది. బస్సులో సుమారు 45 మంది కి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం..
జరిగిన ప్రమాదంలో బస్సులోని 20 మందికి పైగా స్వల్ప గాయాలైనట్టుగా తెలిసింది. గాయపడిన వారిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. RTC అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు.









