పాలకులం కాదు..మేము సేవకులం
కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి
పార్టీ శ్రేణులతో పట్టణంలో పెద్దఎత్తున బైక్ ర్యాలీ
హోరెత్తిన జై కాంగ్రెస్..జై కంది శ్రీనన్న నినాదాలు
అంబేద్కర్ చౌక్‌లో ఘనంగా సోనియాగాంధీ జన్మదినోత్సవం
77 కిలోల భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న శ్రేణులు
ఆదిలాబాద్ః ఎన్నికల్లో ఓడినా..గెలిచినా తాను ప్రజల మనిషినేనని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. అవినీతిలో కూరుకుపోయిన బీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడామని, ప్రజల మద్దతుతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ జన్మదినోత్సవం సందర్భంగా పట్టణంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మావల బైపాస్ వద్ద ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని కలెక్టర్ చౌక్, ఎన్టీఆర్ చౌక్, వివేకానందచౌక్, వినాయక్‌చౌక్, అశోక్‌రోడ్, గాంధీచౌక్, అంబేద్కర్ వరకు సాగింది. కంది శ్రీనివాసరెడ్డి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకుసాగారు. దారి పొడవునా కార్యకర్తలు జెండాలు చేతబట్టుకుని జై కాంగ్రెస్..జై కంది శ్రీనన్న..జై రేవంత్‌రెడ్డి..జై సోనియమ్మ నినాదాలతో హోరెత్తించారు. స్థానిక అంబేద్కర్ చౌక్‌లో అంబేద్కర్ విగ్రహానికి నివాళ్లర్పించిన అనంతరం సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా 77 కిలోల భారీ కేక్‌ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ప్రచార పాటలపై నృత్యాలు చేస్తూ సందడి చేశారు. భారీగా తరలివచ్చిన పార్టీ కార్యకర్తలు, నాయకులతో పురవీధులు కోలాహలంగా మారాయి. పార్టీలో నయాజోష్ కన్పించింది.
ఈ సందర్భంగా కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ దశాబ్దం కిందట డిసెంబర్ 9న తెలంగాణ ప్రజల కలను సోనియమ్మ సాకారం చేసిన రోజని గుర్తు చేశారు. తెలంగాణ తల్లి ఎలా ఉంటుందో ఎవరికి తెలియదని… కానీ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మను చూస్తున్నామన్నారు. ఆమె జన్మదినం రోజున తెలంగాణను ఆమెకు బహుమతిగా ఇస్తున్నామన్నారు. ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి ముమ్మాటికీ ఆ నలుగురే కారణమని ఆరోపించారు. పైసలకు అమ్ముడుపోయి కాంగ్రెస్ పార్టీని ఓడించారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ లీడర్లుగా చెలామణి అయినపుడు రూ.20 కోట్లు ఇవ్వమని అడిగారని, డబ్బులివ్వకపోవటంతో తల్లిలాంటి కాంగ్రెస్‌కు ద్రోహం చేశారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గెలిచినా, ఓడినా తాను ప్రజల మనిషినేనని, ప్రజల కష్టసుఖాల్లో తోడుగా ఉంటానని భరోసా కల్పించారు. పార్టీ కార్యకర్తల అండతో, ప్రజల మద్దతుతో సుమారు 50వేల ఓట్లు సాధించామన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత ప్రజలు బాధపడుతున్నారన్నారు. కంది శ్రీనివాసరెడ్డిని గెలిపిస్తే బాగుండేదని అంటున్నారన్నారు.
తన వెన్నంటే ఉండి కాపాడుకున్న కార్యకర్తలకు అండగా ఉంటానని, ఎవరైన వారి జోలికి వస్తే వారి తాటతీస్తామని హెచ్చరించారు. తనకు ఓపిక ఉందని, వయసూ ఉందని, ఇంకా ఎన్నో దశాబ్దాలపాటు ఇక్కడి ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానని తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థిగా 6 గ్యారంటీల అమలుపై తాను బాండ్ రాసిచ్చినని, వాటి అమలు పూచీ తనదని స్పష్టం చేశారు. ఎవడో గులాబీ పార్టోడు రేవంత్ రెడ్డి సీఎం అయితే ఉరేసుకుంటానని అన్నాడని, కానీ ఆ అవసరంలేదని ఎద్దేవా చేశారు. ప్రాణబీక్ష పెడుతున్నాం..బతికిపో అంటూ వ్యాఖ్యనించారు.ఇకపై వచ్చే ప్రతీ ఎన్నికల్లో ఎగిరేది కాంగ్రెస్ జెండానేనని ధీమా వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ అభివృద్ధి కోసం ప్రశ్నించే గొంతుకగా ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భూపెల్లి శ్రీధర్, డీసీసీబీ డైరెక్టర్ బాలూరి గోవర్ధన్‌రెడ్డి, కిసాన్ సెల్ రాష్ట్ర కార్యదర్శి బోరంచు శ్రీకాంత్‌రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మెన్ ముడుపు దామోదర్‌రెడ్డి, ఎస్టీ సెల్ చైర్మెన్ షెడ్మకి ఆనంద్‌రావు, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చరణ్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి రూపేష్‌రెడ్డి, ఎస్సీ సెల్ చైర్మెన్ చంద్రాల రాహుల్, సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్‌రావు, మైనార్టీ నాయకులు రఫిక్, షకిల్, తదితరులు పాల్గొన్నారు.