ఉచిత బస్సు ప్రయాణంపై మహిళల్లో సంతోషం వ్యక్తం
ఆదిలాబాద్ః కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ హామీలలో రెండు గ్యారంటీలను తక్షణమే అమలు చేయడం అభినందనీయమని, హర్షించదగ్గ విషయమని ఆ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి ఏఐసీసీ అధినేత్రి సోనియగాంధీ పుట్టినరోజు సందర్భంగా మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ మేరకు ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలో కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు స్థానిక బస్టాండ్ వద్ద టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.
జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కంది శ్రీనివాసరెడ్డి తన సతీమణి సాయిమౌనారెడ్డితో కలిసి బస్సులో ప్రయాణిస్తున్న మహిళలకు శాలువాలతో సత్కరించారు.ఈ హామీ అమలు పట్ల వారి అభిప్రాయాలను అడిగితెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్ద పీటవేస్తూ ఈ నిర్ణయం తీసుకుందని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆరు గ్యారంటీల్లో మొదటగా రెండు గ్యారంటీ హామీలను అమలు చేస్తోందని, త్వరలోనే మిగితావి కూడా అమలవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
పేద, మధ్యతరగతి, ఉద్యోగులకు ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. డబ్బులను ఆదా చేసుకుని వాటిని తమ కుటుంబ సంక్షేమం కోసం ఉపయోగించుకోవచ్చని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇక అన్నీ మంచిరోజులేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భూపెల్లి శ్రీధర్, డీసీసీబీ డైరెక్టర్ బాలూరి గోవర్ధన్‌రెడ్డి, కిసాన్ సెల్ రాష్ట్ర కార్యదర్శి బోరంచు శ్రీకాంత్‌రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మెన్ ముడుపు దామోదర్‌రెడ్డి, ఎస్టీ సెల్ చైర్మెన్ షెడ్మకి ఆనంద్‌రావు, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చరణ్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి రూపేష్‌రెడ్డి, ఎస్సీ సెల్ చైర్మెన్ చంద్రాల రాహుల్, సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్‌రావు, కొండూరి రవి, మైనార్టీ నాయకులు రఫిక్, షకిల్, తదితరులు పాల్గొన్నారు.