తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. చంద్రుడికి మబ్బులు పట్టాయని, బీఆర్‌ఎస్ ఓడిపోబోతోందని చెప్పారు. ఈ రోజు రాత్రి నుంచే సంబరాలు చేసుకోండని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌ను ప్రజలు దొరకబట్టుకొని ఓడించారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాదని దేశంలో ఏ సర్వే చెప్పలేదని అన్నారు. సేవకులుగా అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
‘ఓటమి ఖాయమని తెలిసినప్పుడల్లా నియోజకవర్గం మార్చారు కేసీఆర్. గజ్వేల్, మహబూబ్‌నగర్, కరీంనగర్ ఇలా స్థానాలు మారస్తూ కామారెడ్డికి వచ్చారు. కామారెడ్డి ప్రజలు కేసీఆర్‌ను ఇక్కడ దొరకబట్టి ఓడించారు. తెలంగాణ సమాజం చైతన్యవంతమైనదని కామారెడ్డి ప్రజలు నిరూపించారు. ఆనందంగా ఉంది’ అని రేవంత్ రెడ్డి అన్నారు. దిగిపోయే ముందు కేసీఆర్ మీడియా ముందుకు కూడా రాలేదని విమర్శించారు.
శ్రీకాంతాచారికి తెలంగాణ ప్రజల తరఫున ఘనమైన నివాళి తెలుపుతున్నామని రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల తేదీతో శ్రీకాంతాచారికి లింక్ ఉందని చెప్పారు.









