తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొడంగల్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబసమేతంగా రేవంత్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొడంగల్‌లోని జెడ్‌పీహెచ్‌ఎస్ బాయ్స్ సౌత్ వింగ్ పోలింగ్ బూత్ (బూత్ నెం.237)లో టీపీసీసీ చీఫ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఓటు వేసే ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు సమయస్ఫూర్తి ఉన్నవారన్నారు. అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం రావాలంటే ప్రజలకు ఆమోదయోగ్యమైన ప్రభుత్వం రావాలన్నారు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం నీటి సమస్యలపై సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటామని తెలిపారు. కాంగ్రెస్ ఏర్పాటు చేసే ప్రభుత్వంలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఎలాంటి కుట్రలకు లొంగిపోవద్దని తెలంగాణలో 4 కోట్ల ప్రజలకు రేవంత్ విజ్ఞప్తి చేశారు.









