తెలంగాణలో ఎన్నికల హడావుడి కనిపిస్తుంది. నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో ఎన్నికల పోలింగ్ కోసం ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి. కేంద్ర రాష్ట్ర బలగాలతో భారీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 35వేల 655 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే పోలింగ్ రోజు.. వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది.
మంగళవారం తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రేపు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక పోలింగ్ రోజు నవంబర్ 30న కూడా తెలంగాణలో వానలు పడతాయని తెలిపింది. తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.









