స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు (బీసీ) 34 శాతం రిజర్వేషన్లు కల్పించడం ద్వారా బీసీల రాజకీయ ప్రాతినిధ్యం పెరుగుతుందనే భయంతోనే వైసీపీ కోర్టులను ఆశ్రయిస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్రంగా ఆరోపించారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రజల్లోకి వెళ్లి పనిచేసే సత్తా వైసీపీకి లేదని, ప్రభుత్వంపై బురదజల్లడమే లక్ష్యంగా ఆరోపణలు చేయడం, కేసులు వేయడం ఆ పార్టీకి అలవాటుగా మారిందని మంత్రి విమర్శించారు. బీసీల సంక్షేమం, వారి రాజకీయ సాధికారతపై వైసీపీకి ఎలాంటి చిత్తశుద్ధి లేదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు, రాజ్యాంగ హక్కులకు అనుగుణంగానే తమ కూటమి ప్రభుత్వం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తోందని తెలిపారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే 15వ ఆర్థిక సంఘం నిధులు రాష్ట్రానికి అందాయని, ‘పల్లె పండుగ 3.0’ కార్యక్రమం కింద గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపడుతున్నామని మండిపల్లి వివరించారు. గృహ నిర్మాణం, ఉద్యానవన రంగాల అభివృద్ధికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కూటమి పార్టీలు పూర్తి సన్నద్ధంగా ఉన్నాయని, ప్రజల మద్దతుతో వార్డు స్థాయి నుంచి మేయర్ పదవి వరకు నిర్ణయాత్మక విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.







